తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలో తన పర్యటనల సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. ప్రజలను రోడ్లపై గంటల తరబడి నిలబెట్టవద్దని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళుతున్న సమయంలో ట్రాఫిక్ నిలిపివేయడంతో వాహనాలు పెద్ద ఎత్తున ఆగడంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ కోసం సాధారణ ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దన్నారు. కాన్వాయ్ వెళ్లే దారితో పాటు ఎదురుగా వస్తున్న వాహనాలను కూడా ఆపేసి ప్రజలను ఇబ్బంది పెట్టడమేమిటని ప్రశ్నించారు. అలా చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయకుండా సింగిల్ లైన్‌గా విభజించి వాహనాలను పంపించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను ముందు సిద్ధం చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు.
