తెలంగాణ ఉద్యమ గడ్డ కరీంనగర్ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని, ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు.బీజేపీ, బీఆర్ఎస్ మధ్య “ఫెవికాల్ బంధం” ఉందంటూ సీఎం ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఓట్లను బీజేపీకి బదలాయించిందని, అందుకే బీజేపీకి 8 స్థానాలు వచ్చాయని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎంగా మారిందని చెప్పిన ప్రధాని మోదీ, ఇప్పటికీ ఎందుకు సీబీఐ విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. కేవలం రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ధైర్యముంటే ఎల్బీ స్టేడియంకు వచ్చి తలలు లెక్కపెట్టాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, సన్నబియ్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ వంటి పథకాలతో తమది ప్రజా ప్రభుత్వమని చాటిచెప్పారు. కరీంనగర్ జిల్లాకు ఔటర్ రింగ్ రోడ్డు, చొప్పదండిలో డిగ్రీ కాలేజీ, రామడుగులో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) వంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వరంగల్ – కరీంనగర్లను జంట నగరాలుగా అభివృద్ధి చేస్తామని, గోదావరి పరివాహక ఆలయాలను పర్యాటక క్షేత్రాలుగా మారుస్తామని హామీ ఇచ్చారు.
