రెండేళ్లలో రూ.30 కోట్లకు చేరువైన నష్టం..
735 మంది వైద్యులు Cyber scam నేరగాళ్ల బారిన పడినట్లు టీజీసీఎస్బీ వెల్లడి..
హైదరాబాద్: తెలంగాణలో వైద్యులను లక్ష్యంగా చేసుకుని Cyber scam భారీ స్థాయిలో మోసాలకు పాల్పడుతున్నారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) వెల్లడించింది. గత రెండేళ్లలో రాష్ట్రంలోని వైద్యులు వివిధ రకాల ఆన్లైన్ మోసాల వల్ల దాదాపు రూ.29.88 కోట్లు కోల్పోయినట్లు తెలిపింది.
సెప్టెంబర్ 2024 నుంచి ఇప్పటివరకు మొత్తం 735 మంది వైద్యులు Cyber scam లకు గురైనట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో పెట్టుబడులు, వ్యాపారాల పేరుతో జరిగిన మోసాల వల్లే అత్యధికంగా రూ.22 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు పేర్కొన్నారు.
డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే మోసాలు, గుర్తింపు చోరీ (ఐడెంటిటీ థెఫ్ట్), ఇతరుల పేరుతో మోసాలు (ఇంపర్సనేషన్), తప్పుడు ఆన్లైన్ ప్రకటనల ద్వారా కూడా వైద్యులను లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ముఖ్యంగా వైద్యులు తీరికలేని పనివేళల్లో ఉంటారనే అంశాన్ని ఆసరాగా తీసుకుని అత్యవసర పెట్టుబడి అవకాశాలు, అధికారుల పేరుతో బెదిరింపు కాల్స్, బ్యాంకింగ్ ధృవీకరణ సందేశాలు వంటి ఎత్తుగడలను ఉపయోగిస్తున్నారు
టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ, ఉన్నత విద్యార్హతలు లేదా సమాజంలో ఉన్న హోదా ఒక్కటే సైబర్ నేరాల నుంచి రక్షణ కల్పించవని హెచ్చరించారు.
గుర్తు తెలియని ఫోన్ కాల్స్, సందేశాలు, ఆన్లైన్ పెట్టుబడి ఆఫర్ల విషయంలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సైబర్ ఆర్థిక మోసాలకు గురైన వెంటనే జాతీయ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేయాలని, అలాగే అధికారిక సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని టీజీసీఎస్బీ సూచించింది.
తెలియని లింక్‌లపై క్లిక్ చేయకుండా ఉండటం, అనుమానాస్పద యాప్‌లను డౌన్లోడ్ చేయకపోవడం, బ్యాంకు ఖాతాలు మరియు డిజిటల్ వాలెట్లకు ద్వి-దశల భద్రత (Two-Factor Authentication) అమలు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.



