చిన్నారికి మందులు ఇచ్చే విషయంలో దంపతుల మధ్య గొడవ
ఇంటికి వచ్చిన భార్య కుటుంబ సభ్యులు దాడి.. సీసీటీవీలో కీలక దృశ్యాలు
ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నోయిడాకు చెందిన Adobe కంపెనీలో పనిచేస్తున్న 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వినయ్ గుప్తా హత్యకు గురయ్యారు.
ఉదయం భార్యతో జరిగిన గొడవే చివరకు విషాదానికి దారితీసినట్లు పోలీసులు గుర్తించారు.
సాయంత్రం ఇంటికి వచ్చిన భార్య కుటుంబ సభ్యులు వినయ్‌పై దాడి చేయడంతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.
రూ.60 లక్షల వార్షిక ప్యాకేజీ
వినయ్ గుప్తా నోయిడాలోని Adobeలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.
ఆయనకు ఏడాదికి సుమారు రూ.60 లక్షల ప్యాకేజీ ఉన్నట్లు సమాచారం.
మూడున్నరేళ్ల క్రితం రేఖతో ఆయనకు వివాహమైంది. నాలుగున్నర నెలల క్రితం ఈ దంపతులకు అబ్బాయి, అమ్మాయి కవలలు జన్మించారు.
గతంలో కూడా రేఖ, వినయ్ గుప్తా మధ్య పలుమార్లు గొడవలు జరిగినట్లు తెలుస్తోంది.
శుక్రవారం ఉదయం చిన్నారికి మందులు ఇవ్వడం విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత వినయ్ గుప్తా ఆఫీసుకు వెళ్లారు.
ఇంటికి వచ్చిన భార్య కుటుంబ సభ్యులు
ఉదయం జరిగిన గొడవ గురించి రేఖ తన కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలుస్తోంది.
దీంతో ఆమె ఇద్దరు సోదరులు, సోదరి, తండ్రి, మామతో పాటు మరికొందరు ఇంటికి వచ్చారు.
వినయ్ గుప్తా ఇంటికి చేరుకునే సమయానికి వారంతా అక్కడే ఉన్నారు. ఆ సమయంలో వినయ్ తల్లి కూడా ఇంట్లో ఉన్నారు.
వినయ్ గుప్తా, రేఖ కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రేఖ కుటుంబ సభ్యులు ఆయనపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
గొంతు నులిమి, ఛాతిపై కొట్టడంతో వినయ్ మృతి చెందినట్లు సమాచారం.
సీసీటీవీ ఫుటేజీలో కీలక విషయాలు
వినయ్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. రేఖ కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే వినయ్‌పై దాడి జరిగినట్లు ఫుటేజీలో గుర్తించారు.
ఈ ఘటనపై పోలీసులు రేఖ, ఆమె ఇద్దరు సోదరులు, ఒక సోదరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



