కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు దేశ రాజధానిలో ఘనంగా జరిగాయి. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విమానాశ్రయంలోనే రామ్మోహన్ నాయుడితో కేక్ కట్ చేయించి ఆశీస్సులు అందజేశారు.

రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు (డిసెంబర్ 18) సందర్భంగా ఉదయమే సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సాయంత్రం ఢిల్లీ చేరుకోగానే విమానాశ్రయంలో ప్రత్యక్షంగా కలిసి ఆత్మీయ ఆశీస్సులు అందించారు.విమానాశ్రయంలోనే సహచర ఎంపీలు, కీలక నేతల మధ్య రామ్మోహన్ నాయుడు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సరదాగా గడిపారు.
యువ నేతగా కేంద్ర మంత్రివర్గంలో రాణిస్తున్న రామ్మోహన్ నాయుడు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

