గచ్చిబౌలి సైబరాబాద్:( బిఎన్ఎస్ మీడియా): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆడిటోరియంలో రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్, సైబర్ క్రైమ్, శాంతిభద్రతలపై విస్తృతంగా చర్చించారు.
సమీక్ష సమావేశంలో ట్రాఫిక్ భద్రతపై డీజీపీ కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారుల మరణాలు అధికంగా నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. “అలైవ్ అరైవ్” కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13 నుంచి 18 వరకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
“పెడ్‌స్ట్రియన్ కింగ్ ఆన్ ది రోడ్” నినాదం ఉన్నప్పటికీ, పాదచారుల ప్రాణనష్టం జరుగడం బాధాకరమని పేర్కొంటూ రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
42 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు గల కుటుంబ పోషకులు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని డీజీపీ గుర్తుచేశారు. డ్రైవర్లు “డిఫెన్సివ్ డ్రైవింగ్” అలవాటు చేసుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతను బాధ్యతగా భావించేలా ప్రజల్లో అవగాహన పెంపు అవసరమని అన్నారు.
సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై కూడా డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతికతను ఉపయోగించి కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మోసపోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని సూచించారు.
సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ మాట్లాడుతూ, కమిషనరేట్ పరిధి ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లతో విస్తరించి ఉందని తెలిపారు. సైబరాబాద్ పోలీస్ వ్యవస్థకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. మురికివాడల విద్యార్థులు నేరాలకు దూరంగా ఉండేలా ఎన్జీవోలతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి మాట్లాడుతూ, కమిషనరేట్ పరిధిలో నమోదవుతున్న హత్యలు, దోపిడీలు, స్నాచింగ్స్, ట్రాఫిక్ ఉల్లంఘనలు, సైబర్ నేరాలపై వివరాలు వెల్లడించారు. ప్రజల్లో అవగాహన పెంపు ద్వారా నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
సైబర్ క్రైమ్స్ డీసీపీ టి. సాయి మనోహర్ మాట్లాడుతూ, పార్ట్ టైమ్ జాబ్ ఫ్రాడ్, ట్రేడింగ్ మోసాలు, స్మిషింగ్, విషింగ్ కాల్స్, డిజిటల్ అరెస్ట్ మోసాలు పెరుగుతున్నాయని తెలిపారు. అపరిచిత లింకులు క్లిక్ చేయకూడదని, అనుమానాస్పద కాల్స్‌కు స్పందించవద్దని ప్రజలకు సూచించారు.
ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ, ట్రాఫిక్ నిర్వహణలో పారదర్శకత, సాంకేతిక వినియోగంతో ఖర్చు తగ్గింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 96 బ్రెత్ అనలైజర్లలో 50 పరికరాలను ఇన్-హౌస్‌లో మరమ్మతు చేసి సుమారు రూ.4.5 లక్షలు ఆదా చేశామని వెల్లడించారు. “Arrive Alive Campaign-2026”లో భాగంగా 171 కార్యక్రమాలు నిర్వహించి 9,706 మందికి అవగాహన కల్పించినట్లు చెప్పారు.
పండుగల సమయంలో ట్రాఫిక్ 20-25 శాతం పెరుగుతుందని, ఐటీ కారిడార్‌లో రోజుకు లక్షలాది వాహనాలు సంచరిస్తున్నాయని తెలిపారు. ట్రాఫిక్ పర్యవేక్షణకు కెమెరాలు ఏర్పాటు చేసి, రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో వివిధ విభాగాల డీసీపీలు, ఐపీఎస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


