మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘దృశ్యం’ సిరీస్ భారీ విజయం సాధించింది. తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా ఈ రెండు భాగాలను రీమేక్ చేయగా, ఇక్కడ కూడా అవి మంచి హిట్‌గా నిలిచాయి. అయితే ‘దృశ్యం 3’ తెలుగు వెర్షన్ విషయంలో ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్ నుండి వెంకటేష్ తప్పుకున్నట్లు సమాచారం. రీమేక్‌కు బదులు డబ్బింగ్ ‘దృశ్యం 3’ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు. మేకర్స్ తీసుకున్న ఈ పాన్-ఇండియా డబ్బింగ్ నిర్ణయం వల్లే ‘దృశ్యం 3’ తెలుగు వెర్షన్‌కి రీమేక్ అవకాశం లేకుండా పోయిందని అంటున్నారు.
దృశ్యం మొదటి రెండు భాగాల్లో ‘రాంబాబు’ పాత్రలో ఒక సామాన్య మధ్యతరగతి తండ్రిగా వెంకటేష్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ కుటుంబం కథ ముగింపు మూడో భాగంలో చూడాలని ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులకు, అందులో వెంకటేష్ నటించట్లేదన్న వార్త కాస్త నిరాశ కలిగించే అంశమే. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నప్పటికీ, ‘దృశ్యం’ ఒరిజినల్ మేకర్స్ నుండి కానీ లేదా వెంకటేష్ బృందం నుండి కానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దృశ్యం-3 సినిమా మలయాళంలో మే 21న విడుదలవ్వనుంది. అయితే ఇప్పటికీ ఈ సినిమా తెలుగు వెర్షన్ షూటింగ్ పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అందుకే ఈ సినిమాలో వెంకటేష్ నటించడం లేదనే అనుమానాలు పెరుగుతున్నాయి.
