దుబాయిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మృతుల్లో తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు ఉన్నారు. ఎమిరేట్స్ రోడ్డుపై సాంకేతిక లోపంతో రోడ్డు మధ్యలో ఆగిపోయిన లారీని వెనుక నుంచి మినీబస్సు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
లారీ అకస్మాత్తుగా సాంకేతిక సమస్య కారణంగా రోడ్డుపై నిలిచిపోగా.. మినీబస్సు డ్రైవర్ సురక్షిత దూరం పాటించకపోవడంతో లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో జగిత్యాల జిల్లాకు చెందిన సయ్యద్ సలీం (నమిలికొండ), తిరుపతి గౌడ్ (తక్కళ్లపల్లి), అబ్దుల్ రఫీఖ్ (మెట్పల్లి) ఉన్నారు. వీరంతా షార్జాలోని అల్యూమినియం, గ్లాస్ డోర్ ఫ్రే,మ్ల తయారీ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి దుబాయిలోని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.


