యువత డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. మత్తు పదార్థాలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 22 నుండి 28 వరకు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ద్విచక్ర వాహన యాత్ర బుధవారం మధురవాడకు చేరుకుంది.
కొమ్మాది కూడలి నుండి ప్రారంభమైన ఈ యాత్ర చంద్రంపాలెం ఉన్నత పాఠశాల, చైతన్య కళాశాల మీదుగా సాగింది.విద్యార్థులకు, యువతకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. గంజాయి నియంత్రణలో ప్రభుత్వాలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయని, యువత భవిష్యత్తుపై చిత్తశుద్ధి లేదని DYFI నేతలు యూ.ఎస్.ఎన్. రాజు, కె. మహేష్ విమర్శించారు. తల్లిదండ్రుల కలలను నిజం చేయాల్సిన బాధ్యత యువతపై ఉందని, మత్తుకు బానిసలై కుటుంబాలను రోడ్డున పడేయవద్దని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ యాత్ర వాంబే కాలనీ, మారికవలస, స్వతంత్ర నగర్ మీదుగా కొనసాగింది. కార్యక్రమంలో DYFI నాయకులు శ్రావణ్ కుమార్, రాము, శ్రీను, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
