విశాఖపట్నం, హైదరాబాద్‌లో ఐదు చోట్ల ఏకకాలంలో తనిఖీలు
వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై మనీలాండరింగ్ ఆరోపణల దర్యాప్తు
విశాఖపట్నం: చిట్‌ఫండ్ స్కామ్ కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మళ్ల విజయ ప్రసాద్‌కు సంబంధించిన ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం సోదాలు నిర్వహించింది. విశాఖపట్నం, హైదరాబాద్‌లో మొత్తం ఐదు చోట్ల ఈడీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.
మాజీ ఎమ్మెల్యే, వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ అయిన మళ్ల విజయ ప్రసాద్ నివాసం, కార్యాలయం, ఇతర ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి.
మల్టీ-స్టేట్ చిట్‌ఫండ్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ చేపడుతున్న విచారణలో భాగంగానే ఈ తనిఖీలు జరిగినట్లు సమాచారం.
పలు రాష్ట్రాల్లో కేసుల దర్యాప్తు
మళ్ల విజయ ప్రసాద్, వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై వచ్చిన ఆరోపణలను ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ సోదాల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈడీ అధికారులు కూడా పాల్గొన్నట్లు సమాచారం.
తనిఖీల సమయంలో పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
విజయ ప్రసాద్ వైఎస్సార్‌సీపీ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు. గతంలో ఆయనపై ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్‌లో కొన్ని కేసులు నమోదయ్యాయి.
2021లో ఒడిశా పోలీసులు అరెస్ట్
2019లో నమోదైన చిట్‌ఫండ్ కేసులో తన ప్రమేయం ఉందన్న ఆరోపణలతో 2021లో ఒడిశా పోలీసులు విజయ ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు.
ఆ సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉన్నారు.
చిట్‌ఫండ్ మోసం ఆరోపణలకు సంబంధించి ఒడిశా పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (IPC), PC and MC Schemes (Banning Act) of 1978, OPID Act of 2011లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
రూ.1,200 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్ ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది డిపాజిటర్లను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో రూ.1,200 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
2016లో చిట్‌ఫండ్ స్కామ్‌లకు సంబంధించి సీబీఐ కూడా విజయ ప్రసాద్‌పై రెండు కేసులు నమోదు చేసింది.
అప్పట్లో ఆయన కార్యాలయం, నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
2009లో ఎమ్మెల్యేగా విజయం
మళ్ల విజయ ప్రసాద్ 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేదు.



