BAPS ప్రతినిధుల పర్యటనతో వివాదం
పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ సోమవారం అనూహ్యంగా మూసివేశారు. మహిళా ఉద్యోగులను విధుల నుంచి పక్కకు తప్పించారనే ఆరోపణలు వివాదానికి దారితీశాయి. ఈ ఘటనపై సిబ్బంది నిరసనకు దిగారు. ఉద్యోగులు వాకౌట్ చేయడంతో ఈఫిల్ టవర్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.
హిందూ సంస్థ బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (BAPS)కు చెందిన ప్రతినిధి బృందం పర్యటన సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. అసాధారణ పరిస్థితులు ఏర్పడటంతో సందర్శకులకు ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈఫిల్ టవర్ నిర్వహణ సంస్థ SETE ఘటనపై స్పందించింది. పర్యటన సమయంలో మహిళా సిబ్బందితో సంభాషణలను పరిమితం చేయాలని బృందం నుంచి అభ్యర్థన వచ్చినట్లు తెలిపింది. అయితే అలాంటి షరతులను అంగీకరించకుండా ఉండాల్సిందని SETE స్పష్టం చేసింది.
మహిళా సిబ్బందిని పక్కకు తప్పించారనే ఆరోపణలు
ఫ్రాన్స్‌లో కొత్త హిందూ దేవాలయాన్ని ఇటీవల ప్రారంభించిన BAPSకు చెందిన సుమారు 100 మంది ప్రతినిధులు శనివారం ఈఫిల్ టవర్‌ను సందర్శించారు.
ఈ పర్యటన సమయంలో మహిళా ఉద్యోగులను వారి సాధారణ విధుల నుంచి తప్పించినట్లు యూనియన్ ప్రతినిధి డయాన్ డవోయిన్ ఆరోపించారు. ప్రతినిధి బృందం అక్కడ ఉన్న సమయంలో మహిళా ఉద్యోగులు కనిపించకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
మహిళలను వారి లింగం కారణంగా విధుల నుంచి తప్పించడం పట్ల ఉద్యోగులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ అంశమే సిబ్బంది నిరసనకు ప్రధాన కారణంగా మారినట్లు సమాచారం.
SETE ఏమి చెప్పింది?
ఈ ఆరోపణలపై ఈఫిల్ టవర్ నిర్వహణ సంస్థ SETE వివరణ ఇచ్చింది. BAPS ప్రతినిధుల పర్యటన సందర్భంగా మహిళా సిబ్బందితో సంభాషణలను పరిమితం చేయాలని అభ్యర్థన వచ్చినట్లు అంగీకరించింది.
అయితే ఆ అభ్యర్థనను అంగీకరించకూడదని SETE పేర్కొంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని స్పష్టం చేసింది.
సిబ్బంది నిరసన కారణంగా ఈఫిల్ టవర్‌లో కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. సందర్శకుల ప్రవేశాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.
BAPS క్షమాపణలు
ఈ వివాదంపై పారిస్‌లోని BAPS హిందూ దేవాలయం స్పందించింది. ఘటనను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది.
తమ పర్యటన వల్ల ఎవరికైనా బాధ లేదా అసౌకర్యం కలిగితే క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొంది. పెద్ద సంఖ్యలో ప్రతినిధులు రావడంతో ఇతర సందర్శకులకు ఇబ్బంది కలగకుండా పర్యటనను ఏర్పాటు చేసినట్లు వివరించింది.
సాధారణ పనివేళలు ప్రారంభమైన సమయంలోనే పర్యటనను నిర్వహించినట్లు BAPS తెలిపింది. అయితే ఈఫిల్ టవర్‌లో ఎవరినీ ప్రవేశించకుండా నిరోధించలేదని స్పష్టం చేసింది.
పారిస్‌లో రాజకీయ దుమారం
ఈ ఘటనపై పారిస్ మేయర్ ఇమ్మాన్యుయెల్ గ్రెగోయిర్ తీవ్రంగా స్పందించారు. మహిళలను, పురుషులను లింగం ఆధారంగా వేరు చేయడం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపడతామని తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తామని వెల్లడించారు.
జాతీయ అసెంబ్లీ అధ్యక్షురాలు యాఎల్ బ్రాన్-పివెట్ కూడా ఘటనను ఖండించారు. విదేశీ సందర్శకుల డిమాండ్ల కోసం మహిళా ఉద్యోగులను పక్కకు తప్పించరాదని స్పష్టం చేశారు.
ఆలయ ప్రారంభం తర్వాతే ఘటన
ఈ ఘటనకు ఒక్కరోజు ముందే పారిస్‌లో BAPSకు చెందిన కొత్త స్వామినారాయణ ఆలయం ప్రారంభమైంది. ఆ తర్వాతి రోజే ఈఫిల్ టవర్‌లో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది.
ప్రతినిధుల పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నిరసనకు దిగారు. చివరకు సందర్శకులకు ఈఫిల్ టవర్ ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది.



