ఎల్‌నినో ఎఫెక్ట్.. ‘గృహజ్యోతి’ లబ్ధిదారులకు షాక్.. 4 లక్షల మందికి జీరో బిల్లు కట్

July 17, 2026 11:40 AM
Telangana families affected by rising electricity consumption under Gruha Jyothi.

ఉక్కపోతతో పెరిగిన విద్యుత్ వినియోగం.. 200 యూనిట్ల పరిమితి దాటుతున్న ఇళ్లు

జూన్‌లోనే NPDCL పరిధిలో 4 లక్షల మంది సబ్సిడీ కోల్పోయిన పరిస్థితి

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక గృహజ్యోతి పథకంపై ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పథకం నిబంధనల ప్రకారం నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు జీరో బిల్లు అందుతుంది. అయితే ఈ వానాకాలంలో కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం, ఉక్కపోత కొనసాగడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది.

వేసవి తరహాలోనే ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు ఎక్కువసేపు నడుస్తున్నాయి. మరోవైపు వర్షాలు లేక భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోర్లు, మోటార్ల వినియోగం కూడా పెరిగింది. దీంతో అనేక కుటుంబాల నెలవారీ విద్యుత్ వినియోగం 200 యూనిట్ల పరిమితిని దాటుతోంది. ఫలితంగా జీరో బిల్లు సౌకర్యం కోల్పోయి పూర్తి విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఒక్కసారిగా భారీ మొత్తంలో కరెంట్ బిల్లులు రావడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

కొన్ని ప్రాంతాల్లో బిల్లుల విషయంలో విద్యుత్ శాఖ సిబ్బందితో వినియోగదారులు వాగ్వాదాలకు దిగుతున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి.

ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్న ఉత్తర తెలంగాణలోని NPDCL పరిధిలో ఈ పరిస్థితి మరింత స్పష్టంగా ఉంది.

ఈ సంస్థ పరిధిలోని 18 జిల్లాల్లో జూన్ నెలలో సుమారు 4 లక్షల మంది గృహజ్యోతి లబ్ధిదారులు జీరో బిల్లు ప్రయోజనాన్ని కోల్పోయారు.

మొత్తం 26.54 లక్షల మంది అర్హులు ఉండగా, జూన్‌లో 22.59 లక్షల మందికి మాత్రమే జీరో బిల్లులు జారీ అయ్యాయి. ఇందుకు ప్రభుత్వం రూ.99.18 కోట్ల సబ్సిడీ చెల్లించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి నుంచి జూన్ వరకు 6.49 కోట్ల జీరో బిల్లులు జారీ అయ్యాయి. ఈ కాలంలో ప్రభుత్వం రూ.2,355 కోట్ల సబ్సిడీ అందించింది.

విద్యుత్ వినియోగం కూడా రికార్డు స్థాయికి చేరింది. గత మూడు నెలల్లో NPDCL పరిధిలో 5,384 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది.

ఇందులో జూన్ నెలలోనే 1,612.270 మిలియన్ యూనిట్లు వినియోగించారు.

ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాల్లో జూన్ నెలలో 385.321 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. ఇది గతేడాది జూన్‌తో పోలిస్తే దాదాపు 70 శాతం అధికం.

ఇదే పరిస్థితి NPDCL పరిధిలోని మిగతా జిల్లాల్లో కూడా కనిపిస్తోంది.

వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

దీంతో జూలై నెలలో కూడా గృహజ్యోతి జీరో బిల్లు పొందుతున్న వారి సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media