అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో విద్యుత్ ఆపరేటర్ చేసిన ఘోర తప్పిదం ఒక కూలీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. ఎగువ ఇందుకూరుపల్లెలో ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో వినోద్ కుమార్ అనే కూలీ తీవ్రంగా గాయపడ్డాడు.
లైన్మెన్ ఎల్సీ (LC) తీసుకుని మరమ్మతులు చేస్తుండగా, ఆపరేటర్ పవన్ కుమార్ రెడ్డి అజాగ్రత్తగా విద్యుత్తును ఆన్ చేశారు. స్తంభంపై ఉన్న వినోద్‌కు ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి మంటలు అంటుకున్నాయి. షాక్ ధాటికి ఆయన పైనుండి కింద పడిపోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వినోద్‌ను ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వేలూరు ఆసుపత్రికి తరలించారు. ఆపరేటర్ నిర్లక్ష్యంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, ఈ ప్రమాదం జరగడం వాస్తవమేనని రూరల్ ఏఈ (AE) డేనియల్ ధృవీకరించారు.బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుడికి ప్రభుత్వం అండగా నిలవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
