అసోంలో భద్రతా దళాల కాల్పులలో కీలక మావోయిస్టు నేత ఇపిల్ ముర్ము మృతిచెందాడు. ఇటీవల రైల్వే ట్రాక్‌పై జరిగిన పేలుడు ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. జార్ఖండ్ కు చెందిన ముర్ము కొన్ని నెలలుగా అసోంలో రహస్య కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. 23న కోక్రాజార్–సలకటి స్టేషన్ల మధ్య ఐఈడీ ద్వారా రైలు ట్రాక్‌ను ధ్వంసం చేసిన ఘటనలో అతడి హస్తం ఉన్నట్లు గుర్తించారు. భద్రతా దళాలు ముర్ము కదలికలపై పర్యవేక్షణ కొనసాగించగా, సలకటి ప్రాంతంలో గుర్తించిన వెంటనే ఆపరేషన్ ప్రారంభించాయి.
భద్రతా దళాలను గమనించిన ముర్ము కాల్పులు జరపటంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘర్షణలో ముర్ము అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటన అనంతరం, ముర్ము నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఇతర అనుచరులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
