బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో దిశానిర్దేశం
ప్రజా సంబంధాలే నాయకులకు అసలైన బలం అని వ్యాఖ్యలు
రంగారెడ్డి: భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రానున్న గ్రేటర్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త ప్రజల్లో ఉండాలని, గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.
సైబరాబాద్‌లో కాషాయ జెండా ఎగరాలని పిలుపు
సైబరాబాద్ మున్సిపాలిటీలో కాషాయ జెండానే ఎగరాలని ఈటల రాజేందర్ అన్నారు. గెలుపు సాధించాలంటే ప్రతి నాయకుడు ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని సూచించారు.
సమస్యలు పరిష్కరించకుండా కేవలం ప్రచారంతో విజయం సాధించడం సాధ్యం కాదని చెప్పారు.తాను ఎంపీగా గెలిచిన తర్వాత ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కార్పొరేటర్లకు కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చామని గుర్తు చేశారు.
ప్రస్తుతం అక్కడి ప్రజాప్రతినిధులు తమ అవసరం లేకుండానే ప్రజల పనులు పూర్తి చేసే స్థాయికి ఎదిగారని అన్నారు.
పార్టీ జెండానే గుర్తింపు ఇస్తుంది
ప్రతి నాయకుడికి గౌరవం, గుర్తింపు ఇచ్చేది పార్టీ జెండానే అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
గెలిచే నాయకుల వద్దకే అవకాశాలు వస్తాయని చెప్పారు.
నితిన్ నబీన్ కూడా పార్టీ తప్పకుండా గెలవాలని సూచించి వెళ్లారని తెలిపారు.
నాయకుడు పార్టీకి వెలుగు తీసుకురావాలని అన్నారు.అదే సమయంలో పార్టీ కూడా నాయకుడికి గుర్తింపు ఇస్తుందని చెప్పారు.
నాయకుడు పార్టీకి భారం కాకుండా బలంగా నిలవాలని సూచించారు.
మోడీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఈటల
2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని దగ్గరగా గమనిస్తున్నానని ఈటల రాజేందర్ అన్నారు. దేశానికి ఎన్నో సేవలు చేసినా వాటిని ఎప్పుడూ గొప్పగా చెప్పుకోరని తెలిపారు.తాను ప్రజలకు సేవకుడినేనని చెప్పే నాయకుడు మోడీ అని కొనియాడారు.
మోడీ చేసే పనుల్లో పది శాతం చేసినా ఎన్నికల్లో విజయం ఖాయమవుతుందని అన్నారు. ప్రజల విశ్వాసంతో వరుసగా మూడోసారి ప్రధానమంత్రి అయిన నాయకుడు నరేంద్ర మోడీ అని పేర్కొన్నారు.
హైదరాబాద్‌పై మోడీకి ప్రత్యేకమైన అభిమానం ఉందని చెప్పారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు
మాటలతో ప్రజలను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండేళ్లకే ప్రజల అంచనాలను అందుకోలేకపోయిందని ఈటల రాజేందర్ విమర్శించారు.
ఈ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదని వారి పార్టీ నాయకులే మాట్లాడుతున్నారని అన్నారు.
పరిస్థితిని చూసి చాలామంది తమ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
కార్యకర్తలే పార్టీకి బలం
కార్యకర్తలు, ప్రజలే పార్టీకి నిజమైన వీఐపీలు అని ఈటల రాజేందర్ అన్నారు. ప్రజలు ప్రేమించే నాయకులుగానే ప్రతి ఒక్కరూ ఎదగాలని సూచించారు.
నెగెటివ్ వ్యాఖ్యలు చేయడం మానేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తే విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు తమకు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు స్థానిక నాయకులను గెలిపించేందుకు తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు, రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి,
మాజీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, జాతీయ నాయకుడు పెరాల శేఖర్ జీ,
రాష్ట్ర అధికార ప్రతినిధులు ప్రభా గౌడ్,రవికుమార్ యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.



