121 టోల్ ప్లాజాల్లో డిజిటల్ లోకల్ పాస్.. ఏపీలో 12, తెలంగాణలో 3
20 కి.మీ పరిధిలోని అర్హత ఉన్నవారికి అవకాశం.. ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో అప్లయ్
FASTag Local Pass: FASTag వాహనదారులకు గుడ్ న్యూస్.
ప్రతిరోజూ ఒకే టోల్ ప్లాజా మీదుగా ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం కీలక సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది.
స్థానిక వాహనదారుల కోసం అందించే డిజిటల్ FASTag Local Pass సదుపాయాన్ని దేశవ్యాప్తంగా 121 టోల్ ప్లాజాలకు విస్తరించారు.
దీంతో అర్హత ఉన్న వాహనదారులు ప్రతి నెలా లోకల్ పాస్ తీసుకుని సంబంధిత టోల్ ప్లాజా మీదుగా ఎన్నిసార్లైనా ప్రయాణించవచ్చు.
గతంలో లోకల్ పాస్ కోసం వాహనదారులు టోల్ ప్లాజాకు నేరుగా వెళ్లి, అడ్రస్ వెరిఫికేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాల్సి వచ్చేది.
ఇప్పుడు డిజిటల్ విధానం అందుబాటులోకి రావడంతో ఈ ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసుకునే అవకాశం వచ్చింది.
20 కిలోమీటర్ల పరిధి కీలకం
లోకల్ పాస్ పొందాలంటే సంబంధిత టోల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానిక వాహనదారులు అర్హత కలిగి ఉండాలి. అర్హత నిర్ధారణ తర్వాత లోకల్ పాస్ జారీ చేస్తారు.
ఈ పాస్ పొందిన తర్వాత నిబంధనలకు లోబడి ఆ నెలలో సంబంధిత టోల్ ప్లాజా మీదుగా ఎన్నిసార్లైనా ప్రయాణించవచ్చు.
పాస్‌కు నెల రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
DigiLocker, VAHANతో వెరిఫికేషన్
లోకల్ పాస్ కోసం అప్లయ్ చేసే సమయంలో DigiLocker, VAHAN వంటి ప్రభుత్వ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తారు.
వీటి ద్వారా వాహనం, FASTag, అడ్రస్ వివరాలను వెరిఫై చేస్తారు.
అలాగే GIS ఆధారిత వెరిఫికేషన్ ద్వారా రిజిస్టర్ అయిన అడ్రస్ సంబంధిత టోల్ ప్లాజా నుంచి 20 కి.మీ పరిధిలో ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తారు. అర్హత ఉన్న వాహనదారులకు మాత్రమే లోకల్ పాస్ అందుతుంది.
121 టోల్ ప్లాజాలకు విస్తరణ
డిజిటల్ లోకల్ పాస్ విధానాన్ని తొలిసారిగా 2026 జూలైలో ఢిల్లీలోని మండ్కా బక్కర్ వాల్ టోల్ ప్లాజా వద్ద ప్రారంభించారు.
తాజాగా ఈ సదుపాయాన్ని 121 టోల్ ప్లాజాలకు విస్తరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని టోల్ ప్లాజాలకు కూడా ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు సమాచారం.
అయితే ప్రతి FASTag కస్టమర్‌కు ఈ లోకల్ పాస్ వర్తించదు.
సంబంధిత టోల్ ప్లాజా లోకల్ పాస్ పరిధిలో ఉందా, రిజిస్టర్ అడ్రస్ 20 కి.మీ పరిధిలో ఉందా, ఇతర అర్హత నిబంధనలు సరిపోతున్నాయా అనేది ముందుగా చెక్ చేసుకోవాలి.
ఏపీలో 12, తెలంగాణలో 3 టోల్ ప్లాజాలు
అధికారిక డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 12 టోల్ ప్లాజాలు, తెలంగాణలో 3 టోల్ ప్లాజాలు లోకల్ పాస్ సదుపాయం ఉన్న జాబితాలో ఉన్నాయి.
మీకు సమీపంలోని టోల్ ప్లాజా ఈ జాబితాలో ఉందో లేదో ముందుగా చెక్ చేసుకోవాలి.
అనంతరం రాజ్‌మార్గ్ యాత్ర వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా లోకల్ పాస్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు.
నెలంతా ఎన్నిసార్లైనా ప్రయాణం
అర్హత ఉన్న వాహనదారులకు లోకల్ పాస్ తీసుకున్న తర్వాత నెల రోజుల పాటు సంబంధిత టోల్ ప్లాజా మీదుగా ఎన్నిసార్లైనా వెళ్లి రావచ్చు.
ఈ పాస్ ధర రూ.350 వరకు ఉంటుందని సమాచారం.
దీంతో ప్రతిరోజూ ఒకే టోల్ ప్లాజా మీదుగా రాకపోకలు సాగించే స్థానిక వాహనదారులకు టోల్ చెల్లింపుల విషయంలో కొంత ఊరట లభించనుంది.



