చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావాలన్న కూటమి ప్రభుత్వ లక్ష్యం అసెంబ్లీ వేదికగా సాకారం అవుతోంది. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత చొరవతో అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లకు విశేష స్పందన లభిస్తోంది. బుధవారం ఈ స్టాళ్లలో మహిళా ప్రతినిధుల సందడి నెలకొంది.

మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, ప్రశాంతిరెడ్డి తదితరులు స్టాళ్లను సందర్శించి వస్త్రాలను కొనుగోలు చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పొందూరు షర్ట్లు, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి పట్టు చీరలు ఈ స్టాళ్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిత్యం స్టాళ్లను పర్యవేక్షిస్తూ, తోటి ప్రజాప్రతినిధులు చేనేత వస్త్రాలను ధరించేలా మంత్రి సవిత ప్రోత్సహిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త డిజైన్లను అందుబాటులోకి తెస్తున్నామని ఆమె పేర్కొన్నారు.స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించిన ఈ స్టాళ్ల ద్వారా తమ ఉత్పత్తులకు మంచి ప్రచారం లభిస్తోందని రాష్ట్రంలోని చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
