కాకినాడ జిల్లా లో భారీ ప్రమాదం, 20 మందికి పైగా దుర్మరణం

February 28, 2026 6:09 PM

వేట్లపాలెం(బీఎన్ఎస్).. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఉన్న సూర్యశ్రీ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.ఈ ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 30 మందికి పైగా కార్మికులు లోపల ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనం పేకమేడలా కూలిపోయింది.

కార్మికులంతా పనిలో నిమగ్నమై ఉండగా, సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మందుగుండు సామాగ్రికి నిప్పు అంటుకోవడంతో పెను విస్ఫోటనం సంభవించింది. భారీగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. పేలుడ ధాటికి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయి, కిలోమీటర్ దూరంలోని పంట పొలాల్లో ఎగిరిపడ్డాయి.

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. బాణసంచా పరిశ్రమను అడపా నాని అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో యజమాని తండ్రి కూడా మరణించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పోలీసులు 11 మంది మృతదేహాలను గుర్తించారు.

మరోవైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హోం మంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రమాదానికి అసలు కారణం షార్ట్ సర్క్యూటా లేక అజాగ్రత్తా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media