ఉత్తరాంధ్ర రాజకీయ దిగ్గజం, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ అంత్యక్రియలు మంగళవారం శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి శ్మశాన వాటికలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో ముగిశాయి. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తల మధ్య ఆయన అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య సాగింది.
పోలీస్ దళాలు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించాయి. అధికార లాంఛనాల మధ్య కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొని నివాళులర్పించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, కూన రవికుమార్, కిమిడి కళా వెంకట్రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు అప్పల సూర్యనారాయణ సేవలను స్మరించుకున్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు హాజరై అంజలి ఘటించారు.
మాజీ సభాపతి తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్ వంటి విపక్ష నేతలు కూడా తరలివచ్చి అప్పల సూర్యనారాయణకు తుది వీడ్కోలు పలికారు.
