434 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో రెండో ర్యాంకు..
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల డిమాండ్
GADWAL: జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మార్కుల విషయంలో లెక్చరర్ అవమానించారని మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. విద్యార్థి రాసిన సూసైడ్ నోట్‌లో తన మరణానికి గల కారణాలను వివరించినట్లు సమాచారం.
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతిబొట్టు తరుణ్ (17) గద్వాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.
ఇటీవల విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 440 మార్కులకు గానూ 434 మార్కులు సాధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలల విభాగంలో జిల్లా స్థాయిలో రెండో ర్యాంకు పొందాడు.
అయితే అదే కళాశాలలో మరో విద్యార్థికి 435 మార్కులు రావడంతో, ఒక్క మార్కు తేడా మాత్రమే ఉందని శిరీష అనే మహిళా లెక్చరర్ తనను తోటి విద్యార్థుల ఎదుట అవమానించారని తరుణ్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
సూసైడ్ నోట్‌లో సంచలన ఆరోపణలు:
సూసైడ్ నోట్ ప్రకారం.. “434/440 మార్కులు వస్తే నువ్వేమన్నా గొప్పోడివా? నీకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారు కూడా ఉన్నారు” అంటూ లెక్చరర్ తనను అందరి ముందు కించపరిచారని తరుణ్ ఆరోపించాడు.
తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడొద్దని కోరినా, “నువ్వేమైనా మంత్రి కొడుకువా, అంతకంటే గొప్పోడివా?” అంటూ చెంపపై కొట్టి అవమానించారని కూడా నోట్‌లో రాసినట్లు సమాచారం.
ఈ ఘటన సమయంలో తరగతి గదిలో ఉన్న విద్యార్థులు నవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని తరుణ్ తన లేఖలో పేర్కొన్నాడు.
ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించేలా ఉండాలని, అవమానించడం వల్ల సున్నిత మనస్తత్వం ఉన్న విద్యార్థులు ఎంతగా బాధపడతారో గుర్తించాలని తన నోట్‌లో వివరించాడు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరెవరికీ జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా రాసినట్లు సమాచారం.
మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తరుణ్ సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విద్యార్థి మరణంతో కలకలం:
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, విద్యార్థి మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
విద్యార్థుల మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారు కోరుతున్నారు.



