కేంద్ర మంత్రి జార్జి కురియన్ రాజీనామా
కురియన్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
న్యూఢిల్లీ: కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జ్ కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. కురియన్ రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో కేంద్ర పదవి నుంచి తప్పుకున్నారు. జార్జ్ కురియన్ సమర్పించిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది.
జూన్ 21తో ముగిసిన పదవీ కాలం
జార్జ్ కురియన్ రాజ్యసభ సభ్యత్వ కాలం జూన్ 21తో ముగిసింది. అయితే, జూన్ 22న ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా కలిసి, తనకు కేంద్ర ప్రభుత్వంలో సేవలు అందించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఆయనను మళ్లీ నామినేట్ చేయకూడదని నిర్ణయించడంతో ఈ పరిస్థితి నెలకొంది.
కలల్లో కూడా ఊహించని అవకాశం
రాజీనామా ఆమోదం పొందిన తర్వాత జార్జ్ కురియన్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వల్లే తనకు కేంద్ర మంత్రిమండలిలో చోటు దక్కిందని ఆయన పేర్కొన్నారు.
“కేంద్ర మంత్రిగా దేశానికి సేవ చేసే అవకాశం వస్తుందని నేను నా కలల్లో కూడా ఊహించలేదు. ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.” అంటూ జార్జ్ కురియన్ ఫేస్బుక్ లో రాసుకొచ్చారు. ప్రధాని మోదీతో కలిసి నవ్వుతూ దిగిన ఒక ఫోటోను కూడా ఆయన ఈ సందర్భంగా షేర్ చేశారు.
జార్జ్ కురియన్ ఎవరు?
మోదీ ప్రభుత్వంలో మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత కేంద్ర మంత్రిమండలిలో క్రైస్తవ సమాజానికి ప్రాతినిధ్యం వహించిన ఏకైక సభ్యుడిగా ఈయన గుర్తింపు పొందారు. సుదీర్ఘ కాలంగా బీజేపీలో చురుకైన నాయకుడిగా ఉంటూ, కేరళలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు.



