ప్రాంతాలు స్వతంత్ర భారతదేశంలో భాగమయ్యాయి. అయితే గోవాలో మాత్రం అప్పటికీ పోర్చుగీసు పాలన కొనసాగుతోంది. గోవా బ్రిటిష్ పాలనలో లేదు. పోర్చుగీసులు 1510 నుంచి గోవాపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు.
భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గోవాను దేశంలో విలీనం చేసేందుకు దౌత్యపరంగా ప్రయత్నాలు జరిగాయి. అయితే గోవాపై తమ నియంత్రణను వదులుకోవడానికి పోర్చుగల్ అంగీకరించలేదు. దీంతో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా గోవా చాలా కాలం పోర్చుగీసు పాలనలోనే కొనసాగింది.
36 గంటలకు పైగా సాగిన ‘ఆపరేషన్ విజయ్’
1961 డిసెంబర్‌లో పరిస్థితి కీలక మలుపు తిరిగింది. భారత సాయుధ దళాలు ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో భూ, వాయు, సముద్ర మార్గాల్లో సైనిక చర్య ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ డిసెంబర్ 17 నుంచి 19 వరకు కొనసాగింది.
36 గంటలకు పైగా సాగిన సైనిక చర్య తర్వాత పోర్చుగీసు గవర్నర్ మాన్యుయెల్ ఆంటోనియో వస్సాలో ఇ సిల్వా లొంగిపోయారు. దీంతో 1961 డిసెంబర్ 19న గోవా అధికారికంగా భారతదేశంలో భాగమైంది.
అప్పటి నుంచి ప్రతి ఏడాది డిసెంబర్ 19న గోవా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో భారత భూభాగంలో కొనసాగుతున్న పోర్చుగీసు పాలనకు ముగింపు పలికింది.
కేంద్ర పాలిత ప్రాంతం నుంచి రాష్ట్రంగా..
గోవా భారత్‌లో భాగమైన తర్వాత దమన్, దీవ్ ప్రాంతాలతో కలిపి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. 1967లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో గోవా మహారాష్ట్రలో విలీనం కావాలా? లేక కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగాలా? అనే అంశంపై ప్రజలు ఓటు వేశారు.
మెజారిటీ ప్రజలు కేంద్ర పాలిత ప్రాంతంగానే కొనసాగాలని నిర్ణయించారు. ఆ తర్వాత 1987 మే 30న గోవాకు రాష్ట్ర హోదా లభించింది. దీంతో గోవా భారతదేశంలోని 25వ రాష్ట్రంగా అవతరించింది.



