అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇండిగో విమానంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.4.26 కోట్ల విలువైన 24 విదేశీ బంగారు బిస్కెట్లను పట్టుకున్నారు. విమానం టాయిలెట్‌లోని స్పీకర్ బాక్స్‌లో ఈ బంగారాన్ని అధికారులు గుర్తించారు.
జూన్ 12న దుబాయ్ నుంచి ఇండిగో విమానం అహ్మదాబాద్ చేరుకుంది. ముందస్తు సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు, ఇంజనీర్ల సహాయంతో విమానంలో తనిఖీలు నిర్వహించారు. టాయిలెట్‌లో ఉన్న అనౌన్స్‌మెంట్ స్పీకర్ బాక్స్‌లో నల్లటి ప్లాస్టిక్ టేపుతో చుట్టిన రెండు పౌచ్‌లను అధికారులు గుర్తించారు. అందులో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 24 బంగారు బిస్కెట్లు లభించాయి. వీటి మొత్తం బరువు 2,799.3 గ్రాములు కాగా, మార్కెట్ విలువ సుమారు నాలుగు కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.


