సైన్ పెడితే పెళ్లయినట్టు కాదు బాస్! ఏడడుగులు పడాల్సిందే..

July 1, 2026 12:55 PM
Gujarat High Court delivers verdict on Hindu marriage validity.

హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7ను గుర్తు చేస్తూ ఫ్యామిలీ కోర్టు తీర్పును రద్దు చేసిన డివిజన్ బెంచ్

గుజరాత్: ట్విస్ట్‌లు ఇవ్వడంలో మన సినిమా రైటర్లు ఎక్స్ పర్ట్స్ అనుకుంటే పొరపాటే.. రియల్ లైఫ్‌లో కొందరు కేటుగాళ్లు వేసే ప్లాన్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! జస్ట్ కొన్ని కాగితాల మీద సంతకాలు పెట్టించుకుని, నువ్వు నా మొగుడివి బ్రో… అంటూ ఒక ఎన్‌ఆర్‌ఐ కంప్లైంట్ ఇచ్చిన క్రేజీ కేసుకు గుజరాత్ హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా సంచలన తీర్పుతో ఫుల్ స్టాప్ పెట్టింది. హోమం, ఏడడుగులు లేకుండా హిందూ చట్టం ప్రకారం పెళ్లి జరిగిందంటే కుదరదు.. ఆ సర్టిఫికేట్ జస్ట్ కాగితంముక్కతో సమానం అంటూ కింది కోర్టుకు గట్టిగా ఆక్షింతలు వేసింది.


బ్రిటన్‌లో చదువుకుంటూ, అక్కడే జాబ్ చేస్తున్న కౌశల్ సోనార్ అనే యువకుడు ఇండియాకు వచ్చినప్పుడు అహ్మదాబాద్‌కు చెందిన ఒక మహిళను కలిశాడు. ఈ ప్రాసెస్‌లో సదరు మహిళ కొన్ని పత్రాలపై కౌశల్ సంతకాలను స్మార్ట్‌గా సేకరించింది. కట్ చేస్తే.. అతను బ్రిటన్ వెళ్లిపోయాక, ఆ డాక్యుమెంట్లతో పొందిన మ్యారేజ్ సర్టిఫికేట్ పట్టుకుని నేరుగా కౌశల్ పేరెంట్స్ ఇంటికి వెళ్లి వాలింది. మేమిద్దరం ఆల్రెడీ భార్యాభర్తలం అంటూ క్లెయిమ్ చేయడంతో ఆ పేరెంట్స్ నోట మాట రాలేదు. లండన్‌లో ఉన్న కౌశల్‌కు ఈ మ్యాటర్ తెలిసి ఫ్యూజులు ఎగిరిపోయాయి.


కౌశల్ అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తమ మధ్య ఎలాంటి పెళ్లి ఆచారాలు జరగలేదని, మోస పూరితంగా సర్టిఫికేట్ క్రియేట్ చేశారని మొత్తుకున్నాడు. విచారణలో ఆ మహిళ కూడా అవును బ్రో.. మా మధ్య ఎలాంటి పెళ్లి క్రతువులు జరగలేదు, మేము ఒక్క రోజు కూడా కలిసి బతకలేదు అని రిటన్‌గా ఒప్పుకుంది. ఇద్దరూ మాకు పెళ్లే కాలేదని చెప్తున్నా, ఫ్యామిలీ కోర్టు మాత్రం వింతగా బిహేవ్ చేసింది. ప్రభుత్వ అధికారి ఇచ్చిన సర్టిఫికేట్ ఉంది కాబట్టి.. దీనిపై ఏళ్ల తరబడి సుదీర్ఘ విచారణ జరపాల్సిందే అంటూ 2025 నవంబరులో కౌశల్ పిటిషన్‌ను కొట్టేసింది.


దీంతో కౌశల్ గుజరాత్ హైకోర్టు తలుపు తట్టాడు. జస్టిస్ ఇలేష్ జె. వోరా, జస్టిస్ ఆర్.టి. వచ్ఛానీల డివిజన్ బెంచ్ ఈ కేసును విచారించి, ఫ్యామిలీ కోర్టు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరుపక్షాలు పెళ్లే కాలేదని ఒప్పుకున్నప్పుడు.. కేవలం ప్రభుత్వ సర్టిఫికేట్ ఉందనే సాకుతో కేసులను సంవత్సరాల తరబడి లాగి, ప్రజల సమయాన్ని వృధా చేయకండి అంటూ ఫ్యామిలీ కోర్టును మందలించింది. హిందూ వివాహ చట్టం, 1955లోని సెక్షన్ 7 ప్రకారం.. అగ్నిసాక్షిగా జరిగే హోమం, పాణిగ్రహణం, సప్తపది లాంటి సాంప్రదాయక ఆచారాలు పూర్తి కాకుండా హిందూ వివాహం చట్టబద్ధం కాదని తేల్చి చెప్పింది. సెక్షన్ 8 కింద ఇచ్చే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కేవలం పెళ్లి జరిగిందనడానికి సాక్ష్యం మాత్రమే తప్ప.. అసలు మూల క్రతువులే జరగనప్పుడు అది భార్యాభర్తల హోదాను సృష్టించలేదని స్పష్టం చేసింది.


హైకోర్టు న్యాయమూర్తులు హిందూ వివాహ పవిత్రతను వివరించడానికి ఏకంగా ఋగ్వేదం లోని శ్లోకాలను ప్రస్తావించారు. హిందూ సంప్రదాయంలో పెళ్లి అనేది కేవలం పాటలు, డ్యాన్సులు, విందు వినోదాల కోసం చేసుకునేది కాదు. అదొక పవిత్రమైన సంస్కారం. ఒక పురుషుడు, స్త్రీ పరస్పర అంగీకారంతో కుటుంబ వ్యవస్థను నిర్మించుకోవడానికి జీవితాంతం కలిసి నడిచే ఒక పవిత్ర బంధం అని కోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను కూడా బెంచ్ గుర్తు చేసింది.


కోర్టు కౌశల్‌కు పూర్తి ఊరటనిస్తూ.. ఆ పెళ్లిని మొదటి నుంచీ చెల్లనిదిగా డిక్లేర్ చేసింది. అలాగే ఆ ఫేక్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయించుకునేందుకు అధికారులను ఆశ్రయించే స్వేచ్ఛను ఇచ్చింది. ఒకవేళ ఎలాంటి ఆచారాలు లేకుండా కేవలం ఆఫీసులోనే పెళ్లి చేసుకోవాలనుకుంటే.. దేశంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, 1954 ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ చట్టం కింద రిజిస్ట్రార్ సమక్షంలో సంతకాలు పెడితే ఎలాంటి సాంప్రదాయాలు లేకపోయినా పెళ్లి 100% లీగల్ అవుతుంది. కానీ, హిందూ చట్టం కింద మాత్రం సాంప్రదాయాలు లేకుండా కేవలం సర్టిఫికేట్లతో భార్యాభర్తలుగా క్లెయిమ్ చేసుకోవడం కుదరదనేది ఈ తీర్పు ఇచ్చిన అల్టిమేట్ మెసేజ్!


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media