ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్‌కు చేరింది. క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (104) సెంచరీతో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ ఏ దశలోనూ తడబడలేదు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ తొలి వికెట్‌కు 167 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను రాజస్థాన్ నుంచి లాగేసుకున్నారు. గిల్ కేవలం 53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 104 పరుగులు, సాయి సుదర్శన్ 32 బంతుల్లో 58 పరుగులు చేశాడు. వీరిద్దరూ అవుటైన తర్వాత రాహుల్ తెవాటియా (17 నాటౌట్) మ్యాచ్‌ను ముగించాడు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు అర్హత సాధించింది. మే 31న (ఆదివారం) జరిగే టైటిల్ పోరులో గుజరాత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో తలపడనుంది.

