భార్యాభర్తల మధ్య చెలరేగిన కుటుంబ కలహాలు చివరకు హత్యాయత్నానికి దారితీశాయి. నిన్న రాత్రి గుంటూరులో బావపై బామ్మర్ది తన స్నేహితులతో కలిసి దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
2001లో సుమన్ అనే వ్యక్తికి పార్వతితో వివాహం జరిగింది. కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. చెల్లిని వేధిస్తున్నాడన్న కోపంతో పార్వతి అన్న గణేష్, తన స్నేహితులతో కలిసి రాత్రి సమయంలో బావ సుమన్‌పై దాడికి తెగబడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన సిఐ వెంకటేశ్వర్లు, డిసెంబర్ 31 వేడుకల నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు.
రాత్రి 11 గంటల తర్వాత రోడ్లపై తిరుగుతూ గొడవలు చేసే వారిపై న్యూసెన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.31వ తేదీ రాత్రి నగరం మొత్తం పోలీసుల నిఘాలో ఉంటుందని, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
