హఫీజ్ సయీద్‌కు దౌత్యమార్గంలో సమన్లు.. భారత్ కీలక నిర్ణయం

August 25, 2026 10:50 AM

పహల్గామ్ కేసులో హఫీజ్ సయీద్‌కు సమన్లు

పాకిస్థాన్ ఉగ్రవాది, లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు దౌత్యమార్గంలో కోర్టు సమన్లు పంపేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది.

గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కేసులో అతడిని ప్రధాన నిందితుడిగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పేర్కొంది.

ఈ సమన్లను ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ విదేశాంగ శాఖకు అందజేయనున్నారు.

న్యాయ విచారణలో భాగంగా నిందితుడికి కోర్టుకు హాజరై తన వాదన వినిపించుకునే అవకాశం ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేయడమే ఈ చర్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.

స్పందించకపోతే ఏం జరుగుతుంది?

భారత్ పంపిన సమన్లకు హఫీజ్ సయీద్ స్పందించకపోతే అతడిని పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించే అవకాశం ఉంది.

భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 356 ప్రకారం.. నిందితుడు కోర్టుకు హాజరుకాకపోయినా అతడి గైర్హాజరీలో విచారణ కొనసాగించి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.

పహల్గామ్ ఉగ్రదాడి వెనుక హఫీజ్ సయీద్ ప్రధాన నిందితుడని NIA నిర్ధారించింది.

జమ్మూలోని ప్రత్యేక NIA కోర్టు ఇప్పటికే అతడిపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

26/11 కేసులోనూ సమన్లకు చర్యలు

26/11 ముంబయి ఉగ్రదాడి కేసులో హఫీజ్ సయీద్, జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ సహా ఆరుగురు నిందితులకు ఇంటర్‌పోల్ ద్వారా కోర్టు సమన్లు పంపేందుకు ముంబయి పోలీసులు కేంద్ర హోం శాఖను ఆశ్రయించారు.

పాకిస్థాన్‌లో ఉన్న నిందితులకు ఇంటర్‌పోల్ ద్వారా సమన్లు జారీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని హోం శాఖకు లేఖ రాసినట్లు ఉగ్రవాద కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ తెలిపారు.

తమ అభ్యర్థనను ఆగస్టు 3న హోం శాఖ స్వీకరించి, దీనికి కొంత సమయం కోరిందని ఆయన అన్నారు.

భారత్-పాక్ మధ్య అప్పగింత ఒప్పందం లేదు

భారత్, పాకిస్థాన్‌ల మధ్య నేరస్థుల అప్పగింతకు సంబంధించిన ఒప్పందం లేదు.

కొన్నేళ్ల కిందట అమెరికా మాదిరిగా భారత్ కూడా లష్కరే తొయిబా (LeT) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను ఉగ్రవాద నిరోధక చట్టాల కింద ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది.

అతడిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ అయింది.

ఉగ్రవాదులకు నిధుల కేసుల్లో హఫీజ్ సయీద్ తమ అదుపులోనే ఉన్నాడని పాకిస్థాన్ చెబుతోంది.

అయితే అంతర్జాతీయంగా ఎదురయ్యే కఠిన చర్యల నుంచి అతడిని రక్షించేందుకే పాకిస్థాన్ ఇలా వ్యవహరిస్తోందని భారత నిఘా సంస్థలు చెబుతున్నాయి.

ముంబయి ఉగ్రదాడి కేసులో సమన్లు పంపనున్న నిందితుల్లో హఫీజ్ సయీద్, జకీవుర్ రెహ్మాన్ లఖ్వీతో పాటు సాజిద్ మిర్, అబు అల్ఖమా, అసిమ్ అలియాస్ అబు ఖహఫా, మేజర్ అబ్దుర్ రెహ్మాన్ పాషా ఉన్నారు. వీరంతా పాకిస్థాన్ జాతీయులే.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media