హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన కుండపోత వాన కారణంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కూకట్పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, మియాపూర్, హైటెక్ సిటీ, చందానగర్, ముషీరాబాద్, లక్డీకాపూల్, సరూర్‌నగర్, కోఠి, అబిడ్స్, బషీర్‌బాగ్, ట్యాంక్ బండ్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, బాగ్ లింగంపల్లి, రాంనగర్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల ధాటికి రాంనగర్ వీఎస్టీ రోడ్డు, హైదర్‌గూడ తదితర ప్రాంతాల్లో చెట్లు నేలకూలడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ముషీరాబాద్‌తో పాటు నగరంలోని పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. రానున్న రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం బుధవారం నాడు వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.


