కరూర్‌లో సెప్టెంబర్ 27న తమిళిగ వెట్రి కజగం (టీవీకే) నేత, నటుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషాదం నెల రోజులు పూర్తయింది.
ఈ ఘటనలో మరణించిన కుటుంబాలను ఓదార్చేందుకు విజయ్ సోమవారం చెన్నై సమీపంలోని మహాబలిపురంలో సమావేశం నిర్వహించారు. టీవీకే పార్టీ 50 గదులు బుక్ చేసి, బాధిత కుటుంబాలను ప్రత్యేక బస్సుల్లో అక్కడికి రప్పించింది.
అయితే, కరూర్ వెళ్లి స్వయంగా పరామర్శించకుండా వారిని చెన్నైకి పిలిపించడం పట్ల కొందరు బాధితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశాన్ని కొందరు “పార్టీ ఈవెంట్‌లా” చూశారని విమర్శలు వెల్లువెత్తాయి. విజయ్ పక్షం మాత్రం, కరూర్ వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి లభించకపోవడంతోనే ఈ ఏర్పాటు చేశామని స్పష్టం చేసింది.
