అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం తర్వాత Hormuz జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశముండడంతో ప్రపంచ మార్కెట్లో భారీగా చమురు సరఫరా విడుదల కానుంది. దీంతో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలపై ఒత్తిడి పెరిగి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా గత మూడు నెలలుగా గల్ఫ్ ప్రాంతంలో కోట్లాది బ్యారెళ్ల చమురు నిలిచిపోయింది.జలసంధి తెరుచుకుంటే సుమారు 93 మిలియన్ బ్యారెళ్ల నాన్-ఇరానియన్ క్రూడ్ ఆయిల్, 72 మిలియన్ బ్యారెళ్ల ఇరానియన్ చమురు మార్కెట్లోకి రావచ్చు.
అదనపు సరఫరా రావడంతో బ్రెంట్, WTI క్రూడ్ ధరలు పడిపోతాయి. అయితే చైనా, దక్షిణ కొరియా వంటి ప్రధాన కొనుగోలుదారులు ఇప్పటికే ఆగస్టు వరకు సరఫరాలను బుక్ చేసుకోవడంతో తక్షణ డిమాండ్ పెద్దగా లేదు.
అందువల్ల విక్రేతలు మరిన్ని డిస్కౌంట్లు ఇవ్వాల్సి రావచ్చని ట్రేడర్లు భావిస్తున్నారు.
భారత్‌పై ప్రభావం:
భారత్ తన చమురు అవసరాల్లో ఎక్కువ భాగం దిగుమతులపై ఆధారపడుతుంది. Hormuz మార్గం తిరిగి సాధారణ స్థితికి వస్తే దిగుమతి ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.పెట్రోల్, డీజిల్, LPG ధరలపై ఒత్తిడి తగ్గవచ్చు.
అయితే వినియోగదారులకు ధరల తగ్గుదల వెంటనే కనిపించకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



