అరకు నుంచి ముంబైకి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్ : హైదరాబాద్‌లో గంజాయి తరలిస్తున్న ఐదుగురిని CCS స్పెషల్ క్రైమ్ టీమ్, గాంధీనగర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. విశాఖపట్నం జిల్లాలోని అరకు నుంచి ముంబైకి హైదరాబాద్ మీదుగా గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన 38 kg ganja ని స్వాధీనం చేసుకున్నారు.
ఐదుగురు నిందితులు వీరే
పోలీసుల వివరాల ప్రకారం.. అరెస్టైన వారిని మహారాష్ట్రకు చెందిన రాజారామ్ స్వామి కన్ను పడయాచి (78), ముంబైకి చెందిన సంతోష్ బాలారం ప్రజాపతి (65), తమిళనాడుకు చెందిన విజయలక్ష్మి కలియమూర్తి పెల్లై (66), జార్ఖండ్‌కు చెందిన సిల్మినా కుజుర్ (36), షీలా దేవి (48)గా గుర్తించారు.
ట్రావెల్ బ్యాగుల్లో దాచిపెట్టి..
నిందితులు అరకు నుంచి గోధుమ రంగు ప్యాకెట్లలో గంజాయిని తీసుకుని బస్సులో హైదరాబాద్‌కు వచ్చేవారని పోలీసులు తెలిపారు. ఇక్కడి నుంచి మరో బస్సులో ముంబైకి వెళ్లి, గుర్తు తెలియని వ్యక్తి సూచించిన ప్రాంతాల్లో ప్యాకెట్లను అందించేవారని చెప్పారు.
పోలీసుల దృష్టికి రాకుండా ఉండేందుకు గంజాయి ప్యాకెట్లను సాధారణ ట్రావెల్ బ్యాగుల్లో దాచిపెట్టి వేర్వేరుగా ప్రయాణించేవారని తెలిపారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత సుమారు ఒక రోజు వేర్వేరు లాడ్జీల్లో ఉండి, ఆ తర్వాత ముంబైకి వెళ్లేవారని పోలీసులు వెల్లడించారు.
ఒక్కో డెలివరీకి రూ.10 వేల నుంచి రూ.12 వేలు
గంజాయి డెలివరీ చేసిన ప్రతిసారీ నిందితులకు రూ.10,000 నుంచి రూ.12,000 వరకు చెల్లించేవారని పోలీసులు తెలిపారు. అరెస్టైన వారిలో కొందరికి గతంలోనూ గంజాయి రవాణాకు సంబంధించిన క్రిమినల్ కేసుల చరిత్ర ఉన్నట్లు వెల్లడించారు.



