అత్యంత భద్రత ఉన్న ఆయుధాల గదిలో చోరీ
సిబ్బందిలోనే ఎవరో చేశారా? దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్: Hyderabad Cantonment లోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కలకలం రేపింది. అత్యంత భద్రత ఉన్న ఆయుధాల గది తాళాన్ని పగులగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు కీలకమైన ఆయుధాలను ఎత్తుకెళ్లారు.
మొత్తం 12 ఆయుధాలు చోరీకి గురైనట్లు అధికారులు గుర్తించారు. వీటిలో నాలుగు ఏకే-47లు, ఆరు పిస్టళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్ ఉన్నట్లు సమాచారం. ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రి కూడా చోరీ చేసినట్లు తెలుస్తోంది.
ఆదివారం రాత్రి చోరీ.. సోమవారం ఫిర్యాదు
ఆదివారం రాత్రి చోరీ జరిగినట్లు మద్రాస్ రెజిమెంట్ అధికారులు గుర్తించారు. దీంతో సోమవారం ఉదయం బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆర్మీకి సంబంధించిన కీలక వ్యవహారం కావడంతో పోలీసులు కేసు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎలా?
మద్రాస్ రెజిమెంట్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంగా అధికారులు చెబుతున్నారు. ఆర్మీ సిబ్బంది మినహా ఇతరులు సులభంగా ప్రవేశించే అవకాశం ఉండదు.
ఎగ్జిట్ పాయింట్ల వద్ద తనిఖీలు, అనుమతి ఉన్నవారికే ప్రవేశం, నిరంతర గస్తీ, నిఘా కెమెరాలు, భద్రతా సిబ్బంది పర్యవేక్షణ వంటి అనేక స్థాయిల్లో భద్రత ఉంటుంది.
అలాంటి ప్రాంతంలో కీలకమైన ఆయుధాల చోరీ జరగడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు, తెల్లారే వరకు ఈ విషయం ఆర్మీ అధికారుల దృష్టికి రాకపోవడం కూడా మిస్టరీగా మారింది.
సిబ్బందిలోనే ఎవరో చేశారా?
ఆర్మీ అధికారుల ఫిర్యాదుతో బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బయట వ్యక్తులు రెజిమెంట్‌లోకి ప్రవేశించే అవకాశం చాలా తక్కువగా ఉండటంతో సిబ్బందిలోనే ఎవరో ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చదవండి
సాయి పల్లవి చీరకట్టుకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. దీపావళికి పర్ఫెక్ట్ ట్రెడిషనల్ లుక్!
చోరీకి గురైన ఆయుధాలు భారీగా ఉండటంతో ఒక్క వ్యక్తి వాటిని తీసుకెళ్లడం సాధ్యం కాదని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఈ ఘటనలో పాల్గొని ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
పోలీసు ఉన్నతాధికారులు మద్రాస్ రెజిమెంట్‌కు చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు.
చోరీకి పాల్పడిన వ్యక్తులు ఎవరు? ఆయుధాల గది తాళం ఎలా పగులగొట్టారు? భద్రతను ఎలా దాటారు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.


