హాస్టల్ ముసుగులో అక్రమ కార్యకలాపాలు
హైదరాబాద్: నిరుపేద మహిళల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అక్రమంగా అండాలు సేకరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారీ రాకెట్ హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది.
ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలను నగరానికి తీసుకొచ్చి, సరైన వైద్య పర్యవేక్షణ లేకుండానే హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది.
ఈ వ్యవహారంలో ప్రముఖ ఫెర్టిలిటీ సంస్థ సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఒయాసిస్, సద్గురు ఫెర్టిలిటీ కేంద్రాలపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
సంస్థ డైరెక్టర్ డాక్టర్ గేదెల దుర్గారావుతో పాటు పలువురు ఏజెంట్లను కూడా నిందితులుగా చేర్చారు.
అక్టోబర్ 30న హాస్టల్‌పై అధికారుల దాడులు
గత నెల అక్టోబర్ 30న బేగంపేట పోలీస్ ఇన్‌స్పెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
బేగంపేటలోని ప్రకాష్ నగర్ ఎక్స్‌టెన్షన్‌లో ఉన్న అమి నీతా గర్ల్స్ హాస్టల్‌పై దాడి చేశారు.
అమిత్ శర్మ, నిఖత్ శర్మ నిర్వహిస్తున్న ఈ హాస్టల్‌లో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన 12 మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు.
ఒక్కో అండాల దానం సైకిల్‌కు రూ.50,000 ఇస్తామని అమిత్ శర్మ తమకు ఆశ చూపినట్లు బాధిత మహిళలు అధికారులకు తెలిపారు. ఈ ఆఫర్‌తోనే తమను హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు వాంగ్మూలం ఇచ్చారు.
బంజారాహిల్స్‌లోని ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్‌తో పాటు మరికొన్ని కేంద్రాల్లో అండాల సేకరణకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు గుర్తించారు.
వైద్యుల పర్యవేక్షణ లేకుండా హార్మోన్ ఇంజెక్షన్లు
హాస్టల్‌లో అర్హత కలిగిన వైద్యులు లేకుండానే మహిళలకు షెడ్యూల్ హెచ్ కేటగిరీకి చెందిన హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చినట్లు తనిఖీల్లో బయటపడింది.
ఈ ఇంజెక్షన్లు మహిళల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు.
అంతేకాకుండా ఉపయోగించిన సిరంజీలు, మందుల సీసాలను బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలకు అనుగుణంగా పారవేయలేదు.
ఈ వ్యవహారంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) డాక్టర్ పుట్ల శ్రీనివాస్ నవంబర్ 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.
ఒకే సంస్థ కింద ఐదు ఫెర్టిలిటీ క్లినిక్‌లు
దర్యాప్తులో సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన కీలక వివరాలు బయటపడ్డాయి.
ART బ్యాంక్‌తో పాటు ఐదు ఫెర్టిలిటీ క్లినిక్‌లు ఒకే సంస్థ పేరుతో రిజిస్టర్ అయినట్లు అధికారులు గుర్తించారు.
వీటన్నింటికీ డాక్టర్ గేదెల దుర్గారావు డైరెక్టర్‌గా ఉన్నట్లు తేలింది.
మదీనాగూడలోని క్లినిక్, ART బ్యాంక్ ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు.
అండాల సంఖ్య ఆధారంగా ఏజెంట్లకు కమీషన్
ఈ రాకెట్‌లో ఏజెంట్ల పాత్ర కీలకంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకొచ్చేందుకు ART బ్యాంక్ నాలుగు రాష్ట్రాల్లో తొమ్మిది మంది ఏజెంట్లతో ఒప్పందాలు చేసుకున్నట్లు వెల్లడైంది.
ఈ ఏజెంట్లలో అమిత్ శర్మ, నిఖత్ పర్వీన్ అలియాస్ నిఖత్ శర్మ కూడా ఉన్నారు.
ఒప్పందాల ప్రకారం ఒక్కో మహిళను తీసుకొచ్చినందుకు ఏజెంట్లకు రూ.65,000 వరకు చెల్లించేలా నిబంధనలు ఉన్నట్లు గుర్తించారు.
అయితే ఒక మహిళ నుంచి ఏడు కంటే తక్కువ అండాలు సేకరించినా, సేకరించిన అండాలు నాణ్యతగా లేకపోయినా ఏజెంట్ల కమీషన్‌లో 50 శాతం కోత విధించేలా ఒప్పందం చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ నిబంధనల కారణంగా ఎక్కువ అండాలు సేకరించేందుకు మహిళలకు అధిక మోతాదులో హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
66 మంది మహిళల వివరాల్లో 19 మంది రికార్డులు మాయం
ART బ్యాంక్ రికార్డులను పరిశీలించిన అధికారులకు మరో కీలక విషయం తెలిసింది.
జనవరి నుంచి అక్టోబర్ 2026 మధ్య మొత్తం 66 మంది మహిళల నుంచి అండాలు సేకరించినట్లు రికార్డుల్లో ఉంది.
అయితే తనిఖీల సమయంలో అధికారులు అడిగినప్పుడు కేవలం 47 మంది మహిళలకు సంబంధించిన వివరాలు మాత్రమే సమర్పించారు.
మిగిలిన 19 మంది మహిళల రికార్డులను అందించలేదు. ఈ వివరాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనుమతి లేని క్లినిక్‌లకు అండాల సరఫరా
ART బ్యాంక్ నుంచి గచ్చిబౌలి, ఉప్పల్, టోలీచౌకి, మలక్‌పేట ప్రాంతాల్లోని కొన్ని క్లినిక్‌లకు కూడా అండాలను తరలించినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు.
ఇది కూడా చదవండి
నార్సింగిలో భారీ అగ్నిప్రమాదం.. 12వ అంతస్తు నుంచి 18వ అంతస్తు వరకు వ్యాపించిన మంటలు!
ఈ క్లినిక్‌లకు సంబంధించి అధికారిక ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వివరాలు లేనట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా అండాలను సరఫరా చేశారా అనే అంశంపై విచారణ కొనసాగుతోంది.
నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు
DM&HO డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇన్‌స్పెక్టర్ కె. వెంకట్ రెడ్డి నవంబర్ 12 ఉదయం కేసు నమోదు చేశారు.
క్రైమ్ నంబర్ 426/2026 కింద కేసు నమోదు చేశారు. గతంలో నమోదైన Cr. No. 763/2026కు కొనసాగింపుగా ఈ చర్యలు తీసుకున్నారు.
ఈ కేసులో సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారా, డాక్టర్ గేదెల దుర్గారావు, అమిత్ శర్మ, నిఖత్ పర్వీన్ అలియాస్ నిఖత్ శర్మ, దీపికను నిందితులుగా చేర్చారు.
వీరితో పాటు సంస్థకు చెందిన ఇతర డైరెక్టర్లు, గచ్చిబౌలి, ఉప్పల్ క్లినిక్‌ల ఇన్‌ఛార్జ్‌ల పాత్రపైనా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
BNS, ART చట్టాల కింద పలు సెక్షన్లు
నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
- సెక్షన్ 125 – ప్రాణాలకు హాని కలిగించడం.
- సెక్షన్లు 143(2), 143(3) – మానవ అక్రమ రవాణా.
- సెక్షన్లు 271, 272 – అంటువ్యాధులు ప్రబలేలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం.
- సెక్షన్ 318(4) – మోసం.
- సెక్షన్ 61(2) – నేరపూరిత కుట్ర.
- సెక్షన్ 111 – వ్యవస్థీకృత నేరం.
వీటితో పాటు అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం, 2021లోని సెక్షన్లు 33(2), 34 కింద కూడా కేసులు నమోదు చేశారు.
మరో ఏడుగురు ఏజెంట్ల పాత్రపై విచారణ
ఈ వ్యవహారంలో మొత్తం 66 మంది మహిళలను గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించాలని వైద్య ఆరోగ్య శాఖ పోలీసులను కోరింది.
అలాగే సంస్థ, ఏజెంట్ల బ్యాంక్ ఖాతాల లావాదేవీలను పరిశీలించాలని సూచించింది.
ఈ రాకెట్‌లో వైశాలి గవాయ్, మెహెక్ షేక్, లక్ష్మీ దుర్గ, దుర్గా ప్రసాద్, పర్వీన్ షేక్, క్రాంతి కుమార్, నవ్యశ్రీ అనే ఏజెంట్ల పాత్రపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మహిళలను ఏ విధంగా తీసుకొచ్చారు? అండాల సేకరణ ప్రక్రియలో ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించారు? అనుమతి లేని క్లినిక్‌లకు అండాలను ఎలా సరఫరా చేశారు? అనే అంశాలపై పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నారు.


