ఆసుపత్రి గదిలో ఒంటరిగా ఉన్న నర్సు
కొత్తగూడెం జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువతి 7 నెలల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చింది.
ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది.
విధుల్లో భాగంగా ఆసుపత్రిలోనే కేటాయించిన గదిలో ఉంటోంది.
శనివారం మధ్యాహ్నం గదిలోకి వెళ్లిన ఆమె ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చింది.
తలుపులు పగలగొట్టి చూడగా యువతి నేలపై మృతిచెంది కనిపించింది.
ఆమె శరీరంపై గాయాలు ఉండటంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కిటికీలోంచి గదిలోకి.. పోలీసుల విచారణలో నేరం అంగీకారం
ఘటనాస్థలంలో లభించిన ఆధారాలను పరిశీలించిన పోలీసులు ఇది హత్యగా అనుమానించారు.
దర్యాప్తులో భాగంగా రియల్ ఎస్టేట్ సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న బిహార్‌కు చెందిన సైనావుల్లాను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో అతడు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు.
శనివారం మధ్యాహ్నం కిటికీలోంచి నర్సు గదిలోకి వెళ్లి అత్యాచారానికి యత్నించినట్లు సైనావుల్లా చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
బాధితురాలు కేకలు వేస్తూ ప్రతిఘటించడంతో ఆమె గొంతు నులిమి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయినట్లు విచారణలో వెల్లడైనట్లు చెప్పారు.
పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన
ఈ ఘటనతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు. మృతురాలి కుటుంబసభ్యులతో పాటు కాంగ్రెస్, బీజేపీ నాయకులు పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మహేశ్వరం నియోజకవర్గంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని BJP నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళల భద్రత కోసం పోలీసుల పర్యవేక్షణ, భద్రత పెంచాలని కోరారు.



