సంక్రాంతి పండుగకు తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున స్వగ్రామాలకు తరలివెళ్తుండటంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి (NH-65) వాహనాలతో కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని టోల్ ప్లాజాల వద్ద రద్దీ విపరీతంగా పెరిగింది.
పంతంగి, గూడూరు, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని పంతంగి వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం 11 బూత్‌లను, కొర్లపహాడ్ వద్ద 6 బూత్‌లను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఫాస్టాగ్ స్కానింగ్ వేగవంతం చేసేందుకు సిబ్బంది హ్యాండ్ స్కానర్ల సహాయంతో టోల్ వసూలు చేస్తున్నారు. గత ఐదు రోజుల్లోనే ఈ హైవేపై సుమారు 5.50 లక్షల వాహనాలు ప్రయాణించినట్లు సమాచారం. పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
