నగరంలోని భూ ఆక్రమణలపై హైడ్రా (HYDRAA) తన ఉక్కుపాదాన్ని కొనసాగిస్తోంది. శనివారం మియాపూర్లో భారీ ఆపరేషన్ నిర్వహించిన హైడ్రా అధికారులు, సుమారు రూ. 3 వేల కోట్ల విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి కాపాడారు.

శేరిలింగంపల్లి మండలం మియాపూర్ మక్తా మహబూబ్ పేట సర్వే నంబరు 44లో ఈ ఆపరేషన్ జరిగింది. గతంలోనే ఇక్కడ 18 అక్రమ షెట్టర్లను తొలగించిన హైడ్రా, తాజాగా మరో 15 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. ఆక్రమణదారులు రేకులతో ఏర్పాటు చేసిన హద్దులను తొలగించి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఇది ప్రభుత్వ భూమి అని తెలిపే బోర్డులను కూడా ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించిన అధికారులు, ఇప్పటికే దీనికి కారణమైన సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు వేశారు.

వేరే సర్వే నంబర్ల పత్రాలతో ఇక్కడ భూమిని కబ్జా చేసిన ఇమ్రాన్ అనే వ్యక్తిపై ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదైంది.
