ఆయన బతకడం కష్టమే.. ఇమ్రాన్ ఆరోగ్యంపై కుమారుల ఆందోళన

August 26, 2026 10:20 AM

జైలులో ప్రాణాలకు ప్రమాదం ఉందంటున్న కుమారులు

పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆయన కుమారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

జైలులో ఏకాంత నిర్బంధంలో ఉన్న తమ తండ్రికి సరైన వైద్యం అందకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

మంగళవారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇమ్రాన్ కుమారులు ఖాసిం, సులేమాన్ ఈ వ్యాఖ్యలు చేశారు

‘జైలు నుంచి ప్రాణాలతో బయటపడటం కష్టమే’

ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి ప్రాణాలతో బయటపడటం కష్టంగానే కనిపిస్తోందని ఖాసిం అన్నారు.

గత మూడేళ్లుగా ఆయన ఏకాంత నిర్బంధంలో ఉన్నారని చెప్పారు.

కిటికీలు లేని 6×8 అడుగుల గదిలో రోజుకు 23 గంటలకు పైగా ఉంచుతున్నారని ఆరోపించారు.

సరైన వైద్యం అందకపోవడంతో ఇమ్రాన్ తన కుడి కంటి చూపును దాదాపుగా కోల్పోయారని ఖాసిం ఆవేదన వ్యక్తం చేశారు.

ఇమ్రాన్ అంతర్జాతీయ న్యాయవాది జేర్డ్ గెన్సర్ ఈ పరిస్థితిని ‘స్లో-మోషన్ హత్య’గా అభివర్ణించారని తెలిపారు.

సుప్రీంకోర్టు ఆదేశాలపై పాక్ ప్రభుత్వానికి విమర్శలు

ఇమ్రాన్‌ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ పాక్ ప్రభుత్వం ఆ ఆదేశాలను పట్టించుకోవడం లేదని కుమారులు ఆరోపించారు.

ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించడాన్ని తప్పుబట్టారు.

గత ఆరు నెలలుగా తమ తండ్రితో ఒక్కసారి కూడా మాట్లాడలేదని సులేమాన్ అన్నారు.

ఇది స్పష్టమైన మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు.

సైన్యం హస్తం ఉందన్న సులేమాన్

తన తండ్రి నిర్బంధం, చిత్రహింసల వెనుక పాకిస్థాన్ సైనిక యంత్రాంగం హస్తం ఉందని సులేమాన్ ఆరోపించారు.

ఇమ్రాన్‌కు వైద్యం అందించాలని కోరుతూ 21 మంది మాజీ అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లు పాక్ ప్రధానమంత్రికి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

మరోవైపు, ఇమ్రాన్‌ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై పాక్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సెప్టెంబర్ 16న విచారణ జరగనుంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media