జింద్–సోనిపట్ మార్గంలో నడిచే దేశ తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు
డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా స్వచ్ఛమైన సాంకేతికత.. హైడ్రోజన్ రైళ్ల జాబితాలో భారత్‌కు స్థానం
న్యూఢిల్లీ: భారత్‌లో తొలి హైడ్రోజన్ ఆధారిత రైలుకు ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు ఉత్తర రైల్వే పరిధిలోని హర్యానాలో 89 కిలోమీటర్ల జింద్–సోనిపట్ మార్గంలో నడవనుంది.
భారత్‌లో తొలిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని రైల్వేలో ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతికతలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి రైలును నడుపుతారు. దీంతో డీజిల్ రైళ్లతో పోలిస్తే కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. ఈ ప్రాజెక్ట్‌లో హైడ్రోజన్ నిల్వ, రీఫ్యూయలింగ్ సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు.
రైలు ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ X వేదికగా స్పందించారు. హైడ్రోజన్ రైళ్లను నడిపే దేశాల జాబితాలో భారత్ కూడా చేరిందని తెలిపారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన సాంకేతికతను మరింత విస్తరించేందుకు ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందని చెప్పారు.
పైలట్ ప్రాజెక్ట్‌గా రూపొందించిన ఈ హైడ్రోజన్ రైలు ద్వారా కొత్త సాంకేతికత పనితీరును పరీక్షించనున్నారు. భవిష్యత్తులో పర్యావరణహిత రైలు ప్రయాణాలకు ఇది మార్గం సుగమం చేయనుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ రైలు ముఖ్య విశేషాలు
- 10 కోచ్‌ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత రైలు.
- 1200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్.
- గరిష్ఠ ఆపరేటింగ్ వేగం గంటకు 75 కిలోమీటర్లు.
- డిజైన్ వేగం గంటకు 110 కిలోమీటర్లు.
- సుమారు 2,600 మంది ప్రయాణికులకు సామర్థ్యం.
- డిజైన్ నుంచి ప్రోటోటైప్ తయారీ వరకు పూర్తిగా అభివృద్ధి చేసిన ప్రాజెక్ట్.
- జింద్ జంక్షన్, గోహానా జంక్షన్, సోనిపట్ స్టేషన్లను అనుసంధానిస్తుంది.
- జింద్ సిటీ, పండు పిండారా జంక్షన్, లలిత్ ఖేరా హాల్ట్, భాంభేవా, ఇసాపూర్ ఖేరి హాల్ట్, బుటానా హాల్ట్, ఖండ్రాయి హాల్ట్, రబ్రా హాల్ట్, లాత్ హాల్ట్, మొహానా, బర్వాస్ని హాల్ట్, సోనిపట్ న్యూ స్టేషన్లలో ఆగేలా ప్రతిపాదించారు.
హైడ్రోజన్ రైళ్లు నడుపుతున్న ఇతర దేశాలు:
హైడ్రోజన్ ఆధారిత రైళ్ల వినియోగంలో భారత్ ఇప్పుడు జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల సరసన నిలిచింది.
ప్రపంచంలో తొలి హైడ్రోజన్ ప్రయాణికుల రైలును జర్మనీ ప్రవేశపెట్టింది. Alstom Coradia iLint పేరుతో రూపొందిన ఈ రైలు 2022లో రీఫ్యూయలింగ్ లేకుండా 1,175 కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు సృష్టించింది.
లోయర్ సాక్సోనీలోని బ్రెమెర్వోర్డే మార్గంలో ఈ రైళ్లు డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా సేవలు అందిస్తున్నాయి.
ఈ ఏడాది జర్మనీ Sudostbayernbahn నెట్‌వర్క్‌లో మరో మూడు హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇవి Muhldorf–Tubling–Burghausen మార్గంలో నడవనున్నాయి.
జపాన్ 2027 ఆర్థిక సంవత్సరం చివరినాటికి తొలి హైడ్రోజన్ హైబ్రిడ్ రైలును ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. “Hybari” పేరుతో ఈ రైలు టోక్యో సమీపంలోని కనగావా ప్రిఫెక్చర్‌లోని Tsurumi మరియు Nambu లైన్లలో నడవనుంది.
అమెరికాలో 2024లో కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో Zemu పేరుతో తొలి హైడ్రోజన్ ప్రయాణికుల రైలును ప్రవేశపెట్టారు.



