విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండ పటిష్టతపై శాస్త్రీయ అధ్యయనం చేసేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (NIRM) శాస్త్రవేత్తల బృందం క్షేత్రస్థాయి సర్వేను ప్రారంభించింది.
ఈ నెల 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సర్వేలో భాగంగా, కొండ రాళ్ల స్థితిగతులు, పటుత్వం, భూగర్భ నిర్మాణాలపై సమగ్ర పరిశోధనలు చేపడుతున్నారు. తీవ్ర ఉష్ణోగ్రతల మధ్య కూడా భక్తుల భద్రత దృష్ట్యా బృందం నిరంతరం పనిచేస్తోంది.ఇంద్రకీలాద్రిలోని కొండలైట్ రాతి నిర్మాణంలో ఉష్ణోగ్రతల ప్రభావం, రాళ్ల మార్పులు, జారే ప్రాంతాలను ఆధునిక పరికరాలతో విశ్లేషిస్తున్నారు. జాతీయ రహదారి, ఘాట్ రోడ్ల వెంట ఉన్న రాళ్ల నమూనాలను సేకరించి భౌగోళిక, జియోటెక్నికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.భవిష్యత్తులో నిర్మించనున్న పాశుపాతాలయం, రెండవ ఘాట్ రోడ్డు వంటి ప్రాజెక్టులకు ఈ నివేదిక మార్గదర్శకంగా నిలవనుంది.ఈ అధ్యయనం ఆధారంగా తీసుకునే రక్షణ చర్యలతో కొండ చరియల ముప్పు తగ్గి, ఇంద్రకీలాద్రి మరింత సురక్షితమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని దేవస్థానం ఈవో తెలిపారు.
