జనగామ బస్టాండ్ నుంచి బస్సు తీసుకెళ్లిన వ్యక్తి
సింగరాజుపల్లి టోల్ ప్లాజా వద్ద అదుపు తప్పడంతో బయటపడిన ఘటన
Jangaon: జనగామ జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో( Intoxicated ) ఉన్న ఓ వ్యక్తి జనగామ RTC బస్టాండ్‌లో పార్క్ చేసి ఉన్న RTC హైర్ సర్వీస్ బస్సును తీసుకెళ్లాడు. తర్వాత సూర్యాపేట వైపు ప్రయాణించి టోల్ ప్లాజా వద్ద హల్‌చల్ సృష్టించాడు.
అధికారుల సమాచారం ప్రకారం, పాలకుర్తికి చెందిన వెంకన్న గురువారం రాత్రి డిపో సిబ్బంది దృష్టి మళ్లిన సమయంలో బస్సును తీసుకుని సూర్యాపేట వైపు వెళ్లాడు. సుమారు 21 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత తెల్లవారుజామున సింగరాజుపల్లి టోల్ ప్లాజాకు చేరుకున్నాడు.
టోల్ ప్లాజా లేన్‌లో బస్సును సరిగా నడపలేక వెంకన్న వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో టోల్ ప్లాజా వద్ద ఉన్న సిమెంట్ బ్లాక్‌ను పలుమార్లు ఢీకొట్టాడు. ఇది గమనించిన టోల్ ప్లాజా సిబ్బంది అనుమానం వ్యక్తం చేసి బస్సును ఆపి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సును స్వాధీనం చేసుకుని వెంకన్నను విచారించారు. డిపో నుంచి బస్సును ఎందుకు తీసుకెళ్లావని ప్రశ్నించగా, “టెస్ట్ డ్రైవ్ కోసం తీసుకెళ్లాను” అని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వెంకన్నపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.



