() ఉపాధి హామీ పథకాన్ని అటకెక్కించారు.. పేదలకు కూలి గిట్టడం లేదు!
() సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజమెత్తుతూ ట్వీట్
() కూటమి ప్రభుత్వంపై లెక్కలతో సహా సెటైర్లు
() నిర్వీర్యమవుతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన
() గత రెండేళ్ల గణాంకాలను వివరిస్తూ ‘ఎక్స్’ వేదికగా విమర్శలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై లెక్కలతో సహా విరుచుకుపడ్డారు. ప్రభుత్వం కేవలం అవినీతిపైనే ధ్యాస పెట్టిందని, పేదల పొట్ట కొట్టేలా పథకం అమలులో నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు.
గణాంకాలతో ఎండగట్టిన జగన్:
చంద్రబాబు పాలనలో ఉపాధి హామీ పథకం ఎంత దారుణంగా పడిపోయిందో వివరిస్తూ జగన్ ఒక టేబుల్‌ను షేర్ చేశారు. లేబర్ బడ్జెట్ నుంచి పనులు కల్పించిన కుటుంబాల సంఖ్య వరకు అన్నీ గణాంకాల్లోనూ భారీ తగ్గుదల కనిపించడం రాష్ట్ర అభివృద్ధి తిరోగమనానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
కొనుగోలు శక్తి పడిపోయింది..
“గ్రామీణ పేదల చేతికి డబ్బులు అందితేనే మార్కెట్‌లో వినియోగం పెరుగుతుంది, ఆర్థిక చక్రం తిరుగుతుంది. కానీ గత రెండేళ్లుగా ఏపీలో పరిస్థితి దారుణంగా ఉంది” అని జగన్ విశ్లేషించారు. రాష్ట్రంలో జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్ వృద్ధి రేట్లు పడిపోవడానికి ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేకపోవడమే కారణమని ఆయన ఆరోపించారు. ఒకప్పుడు దేశంలోనే ఉపాధి హామీ అమలులో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్, నేడు కూటమి ప్రభుత్వం వల్ల చిట్టచివరికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇప్పటికైనా పబ్లిసిటీ స్టంట్లు మానేసి, క్షేత్రస్థాయిలో కూలీలకు పనులు కల్పించి వారిని ఆదుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.
