హైదరాబాద్లో పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన Janasena పవన్..
హైదరాబాద్: Janasena పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని శుక్రవారం హైదరాబాద్లోని మణికొండలో పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణలో జనసేన రాజకీయ ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తామని ఆయన ప్రకటించారు.
పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం తర్వాత నాయకులను ఉద్దేశించి మాట్లాడిన పవన్ కళ్యాణ్, ప్రజల సమస్యలే పార్టీ ప్రధాన అజెండాగా ఉండాలని చెప్పారు.
తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చేలా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రత, జాతీయ ఐక్యతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
తెలంగాణ ఆత్మ తనకు బాగా తెలుసని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక్కడి నేల, పోరాటాలు, త్యాగాలు తనకు స్ఫూర్తినిచ్చాయని చెప్పారు.తెలంగాణ యువత కులాలకు అతీతంగా హక్కుల కోసం చేసిన ఉద్యమాలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు.
తెలంగాణలో పార్టీ ఎలా ముందుకు సాగాలనే దానిపై కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
కొత్తగా పార్టీలో చేరిన నాయకులకు సీనియర్ నేతలు మార్గనిర్దేశం చేసి పార్టీ సిద్ధాంతాలను వివరించాలని కోరారు.
తెలంగాణలో కూడా ‘జనవాణి’ కార్యక్రమాన్ని నిర్వహించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.ప్రజలు తమ సమస్యలతో వస్తే ముందుగా వారికి గౌరవం ఇవ్వాలని, వారి సమస్యలను పూర్తిగా వినాలని చెప్పారు.
తెలంగాణ దేశానికి గుండెకాయలాంటి ప్రాంతమని పవన్ కళ్యాణ్ అన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ దూరదృష్టితో హైదరాబాద్లో ఐదు రోజుల పోలీస్ యాక్షన్ జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి ప్రాంతం, అక్కడి ప్రజల కోసం పార్టీ నాయకులు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పోరాట స్ఫూర్తి దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
జనసేన ఉద్యమం తెలంగాణతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కూడా ప్రారంభమైందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.



