“నాలుగు దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేయడమే నేను చేసిన పాపమా? రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా ఉండటం తప్పా?” అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆయన నిలదీశారు.
పార్టీ ఫిరాయింపు చట్టం కింద నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే (సంజయ్ కుమార్)తో కూర్చొని కాంగ్రెస్ టికెట్లపై చర్చించడం ఏమిటని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఇది పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం కాదా అని నిలదీశారు. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి లాఠీ దెబ్బలు తిన్న కార్యకర్తల నోటి కాడి కూడును వలసవాదులు లాక్కుంటుంటే చూస్తూ ఊరుకోలేనని స్పష్టం చేశారు. జీవితంలో ఒక్కసారి కూడా కాంగ్రెస్ జెండా పట్టని వారికి బీ-ఫారాలు ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్ గమనించాలని కోరారు. “నేను ప్రతిపాదించిన జాబితాలో మార్పులు చేయడంపై కార్యకర్తలతో సమావేశమై నిర్ణయం తీసుకోవాలి. జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలవడమే నా ధ్యేయం” అని జీవన్ రెడ్డి పునరుద్ఘాటించారు.
