TG:జగిత్యాల MLA సంజయ్‌పై జీవన్ రెడ్డి ఫైర్

January 28, 2026 5:17 PM

జగిత్యాల పట్టణ మున్సిపాలిటీని స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అవినీతికి కేంద్రంగా మార్చారని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు, విజిలెన్స్ విచారణలే మీ అభివృద్ధికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఎనిమిది మంది ఉద్యోగులు జైలు పాలు కావడానికి ఎమ్మెల్యే విధానాలే కారణమని ఆరోపించారు. ఐదేళ్ల కాలంలో 16 మంది కమిషనర్లు మారడం దేశంలోనే ఎక్కడా జరగలేదని, ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక మున్సిపల్ చైర్‌పర్సన్ మానసిక క్షోభతో రాజీనామా చేశారని గుర్తు చేశారు.

చైర్‌పర్సన్ సీటు ఖాళీ అయితే, చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని బలహీన వర్గాల హక్కులను కాలరాశారని మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రారంభించి రెండేళ్లు అవుతున్నా ఎందుకు వినియోగంలోకి తీసుకురాలేదని నిలదీశారు. ఇదే సమావేశంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడం పట్ల జీవన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి రైతు లోకానికి, యావత్ సమాజానికి తీరని లోటు అని పేర్కొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media