జగిత్యాల సభ తెలంగాణ ఉద్యమాన్ని తలపించింది.. జీవన్ రెడ్డి వెల్లడి

April 21, 2026 8:20 PM

జగిత్యాల (బీఎన్ఎస్): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి, సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి పట్టిన ‘శని’ రేవంత్ రెడ్డి అని, ఆ శని వదిలితేనే తెలంగాణకు మేలు జరుగుతుందని మండిపడ్డారు. బుధవారం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిన్న జగిత్యాలలో జరిగిన కేసీఆర్ బహిరంగ సభ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని తలపించిందని కొనియాడారు.

కేసీఆర్ విద్యకు ప్రాధాన్యతనిస్తూ గ్రామీణ పేదల కోసం గురుకులాలను ఏర్పాటు చేస్తే, రేవంత్ రెడ్డి వాటిని నిర్వీర్యం చేస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. “మేము ఎప్పుడూ రేవంత్ కీడు కోరలేదు, కానీ ఆయన పాలనలో ప్రజలు వంచనకు గురవుతున్నారు. ప్రజాపాలన పేరుతో పేదల ఇళ్లను హైడ్రాతో కూలుస్తున్నారు. ఈ ప్రజాపాలన కేవలం రేవంత్ తాబేదార్ల కోసమేనా?” అని ప్రశ్నించారు.

తన రాజకీయ ప్రస్థానంపై వస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ.. “నా ప్రజా జీవితం తెరిచిన పుస్తకం. రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తున్నాను. నాకు సమర్థత లేకపోతే 14 సార్లు టికెట్ ఎలా ఇచ్చారు? రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్సీగా గెలిచాను. కానీ సీఎం హోదాలో ఉండి, కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా నీ సొంత నియోజకవర్గంలో పార్లమెంటు సీటు ఎందుకు గెలిపించుకోలేకపోయావు?” అంటూ రేవంత్‌కు సవాల్ విసిరారు.

జీవన్ రెడ్డి తన ప్రసంగంలో పలు కీలక అంశాలను లేవనెత్తారు. కోట్లాది ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణను కేసీఆర్ సాధించబట్టే, నేడు రేవంత్ సీఎం హోదాలో తిరుగుతున్నారని గుర్తుచేశారు. “గత 20 నెలలుగా మానసికంగా కృంగిపోయాను. కేసీఆర్ పెద్ద మనస్సుతో నన్ను ఆదరించారు. నాకు పదవుల కంటే ఆత్మగౌరవమే ముఖ్యం. పీసీసీ పదవి చేజారినా నేను ఢిల్లీకి వెళ్లి పైరవీలు చేయలేదు.” అని అన్నారు. ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారని, ఇది రేవంత్ తన సొంత కుంపటి (వర్గం) పెట్టుకోవడానికేనని ఆరోపించారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు దూతగా ఉంటూ త్వరలోనే బీజేపీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media