టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పక్క నియోజకవర్గాల ఓటర్లను చేర్చారని ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని బీజేపీ ప్రభావితం చేస్తోందని, ఈసీని “గుప్పెట్లో పెట్టుకుని అవకతవకలకు పాల్పడుతోంది” అని ఆయన విమర్శించారు.
రాహుల్ గాంధీ ఇప్పటికే ఓటర్ల అవకతవకలను ఆధారాలతో నిరూపించారని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కలిసి ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు.
హర్యానా ఎన్నికల్లో కూడా ఇలాంటి అవకతవకలు జరిగాయని, 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని, “ఒకే మహిళ ఫోటోతో వంద ఓట్లు ఉన్నాయ”ని గౌడ్ తెలిపారు. ఇతర రాష్ట్రాల వారిని కూడా ఓటర్లుగా చేర్చారని, బీహార్‌లో బీజేపీ ప్రతిపక్ష ఓట్లను తొలగించిందని ఆయన ఆరోపించారు.
రాహుల్ గాంధీ ఆధారాలతో ఈసీని ప్రశ్నించినప్పటికీ స్పందన రాలేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఓట్ల అవకతవకలకు వ్యతిరేకంగా 5 కోట్ల సంతకాలు సేకరించామని తెలిపారు.
మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ప్రతిబింబించలేదని, కేంద్రం దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తోందని విమర్శించారు.

