డబ్బున్నోడికి రెడ్ కార్పెట్… పావుగా మారిన ఈమె కథగుర్తుందా?

July 8, 2026 4:09 PM
Chandrababu Naidu and Sajjan Jindal at JSW Kadapa event.

జెత్వానీ కేసు, ఐపీఎస్ అధికారులపై విచారణ, రాజకీయాలపై ప్రశ్నలు

వ్యవస్థలో రాజ్యాంగంలో రాయని ఒక చట్టం ఉంది. ఎంతపెద్దకేసులో నిందితుడైనా వెనుక వేల కోట్ల సామ్రాజ్యం ఉంటే.. ఏ చట్టాలూ, ఏ సరిహద్దులూ అతడిని ఆపలేవు. అదే బాధితురాలి వెనుక ఏ అండ లేకపోతే.. ఆమె గొంతు నొక్కడానికి ప్రభుత్వాలు, పోలీసులు రాత్రికి రాత్రే ఏకమైపోతారు. ఇప్పడు ఈ కథంతా ఎందుకంటారా?… మొన్న కడప జిల్లాలో రూ16,350 కోట్ల జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ భూమి పూజలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ పక్కపక్కనే కూర్చుని నవ్వుతూ దిగిన ఫోటోలు చూసే ఉంటారు కదా… మరి విషయం గుర్తుకు వచ్చిందా?… రాకుంటే ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి..


నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం, నేడు చంద్రబాబు కూటమి సర్కార్.. పాలకులు మారినా, సిద్ధాంతాలు మారినా సజ్జన్ జిందాల్ లాంటి క్రోనీ క్యాపిటలిస్టుల పట్ల చూపే ఆదరణ మాత్రం మారలేదు. ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ.. సజ్జన్ జిందాల్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టినప్పుడు, ఒక పారిశ్రామికవేత్తగా చట్టప్రకారం దాన్ని కోర్టులో ఎదుర్కోవాల్సింది జిందాల్. కానీ, వ్యవస్థను తన జేబులో పెట్టుకోవాలనుకున్న ఆయన నాడు ఏపీని ఏలుతున్న జగన్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. అక్కడి నుంచి నడిచింది అసలైన అరాచక పర్వం.


ఏపీ పోలీసులకు ముంబైలో ఏం పని? కానీ, జిందాల్ ఈగోను శాంతింపజేయడానికి అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ సీపీ కాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్నిలు పచ్చజెండా ఊపేశారు. ఎలాంటి పక్కా ఆధారాలు లేకుండా, కేవలం అప్పటి వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ ఫిర్యాదును సాకుగా చూపి, ముంబై వెళ్లి జెత్వానీని, ఆమె వృద్ధ తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. 42 రోజుల పాటు ఆమెను విజయవాడలో అక్రమంగా నిర్బంధించి, జిందాల్‌పై కేసు వెనక్కి తీసుకోకపోతే సర్వనాశనం చేస్తామని బెదిరించారు. ఒక ప్రైవేట్ వ్యక్తి వ్యక్తిగత కక్షల కోసం, ఒక రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అధికారికంగా సుపారీ గ్యాంగ్‌లా మారిపోయింది!


ప్రభుత్వం మారింది, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక జెత్వానీ కేసును పొలిటికల్ అస్త్రంగా మార్చుకున్నారు. తప్పు చేసిన ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసి తాము ధర్మాన్ని కాపాడుతున్నాం అని కలరింగ్ ఇచ్చారు. కానీ 2026 నాటికి ఈ కేసు అప్‌డేట్ చూస్తే.. వ్యవస్థ లోపాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారులు పి. సీతారామాంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నిలపై క్రిమినల్ విచారణ నత్తనడకన సాగుతోంది. ఐపీఎస్ విశాల్ గున్ని ఈ సస్పెన్షన్‌పై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించి స్టే తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ట్రిబ్యునల్స్, కోర్టుల చుట్టూ తిరుగుతూ టెక్నికల్ లూప్‌హోల్స్‌తో ఈ అధికారులు తమ సర్వీసులను, జీతభత్యాలను కాపాడుకునే లీగల్ ఫైట్ చేస్తున్నారు. అంటే.. చట్టాన్ని బూట్ల కింద తొక్కిన అధికారులకు కూడా వ్యవస్థలో బోలెడన్ని రక్షణ కవచాలు దొరుకుతాయి. కానీ, సర్వం కోల్పోయిన జెత్వానీ మాత్రం నేడు ఏపీకి రావాలన్నా, న్యాయం కోసం పోరాడాలన్నా భయపడే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆమె కేసు మీడియా హెడ్‌లైన్స్‌ నుంచి పూర్తిగా మాయమైపోయింది.


ఒక పారిశ్రామికవేత్తపై కేసు ఉండటం వేరు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుబడులు ఆహ్వానించడం వేరు అనే ప్రాక్టికల్ పాలిటిక్స్ థియరీని చంద్రబాబు ప్రభుత్వం స్క్రీన్‌పైకి తెచ్చింది. కడప జిల్లాలో రూ16,350 కోట్ల భారీ పెట్టుబడితో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ వస్తోంది.

సో … సజ్జన్ జిందాల్‌ను నెత్తిన పెట్టుకోవడంలో తప్పులేదనే నేరేటివ్‌ను కూటమి సర్కార్ బిల్డ్ చేస్తోంది. కానీ ఇక్కడే ఒక నైతిక ప్రశ్న తలెత్తుతోంది. నాడు జెత్వానీని వేధించినప్పుడు నిందితుడైన జిందాల్ వెనుక నిలబడ్డ జగన్ తప్పు అయితే.. నేడు అదే జిందాల్‌తో వేదికలు పంచుకుంటూ, ఆయనను గొప్ప పారిశ్రామికవేత్తగా కీర్తిస్తున్న చంద్రబాబు వైఖరి కరెక్ట్ ఎలా అవుతుంది? అంటే, రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తెస్తే.. సదరు వ్యక్తి చేసే ఎలాంటి నేరాలనైనా, అరాచకాలనైనా పాలక వ్యవస్థలు క్షమించేస్తాయా?.. అంటే భారతదేశంలో చట్టాలు, రూల్స్, ఎఫ్‌ఐఆర్‌లు అన్నీ కేవలం అండలేని సామాన్యులకే వర్తిస్తాయి. జగన్ హయాంలోనైనా, చంద్రబాబు రాజ్యంలోనైనా డబ్బున్నోడు దేవుడిలాగే బతుకుతాడు. ఆయన వ్యాపారాలు సాగిపోతాయి, ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతాలు లభిస్తాయి.

రాజకీయ నాయకులు: విపక్షంలో ఉన్నప్పుడు బాధితుల తరఫున కన్నీళ్లు పెడతారు, అధికారంలోకి రాగానే పెట్టుబడుల లెక్కలు చూపిస్తూ నిందితులతో షేక్‌హ్యాండ్‌లు ఇస్తారు. లీడర్ల కాళ్ల దగ్గర పడి, చెప్పిన పాపాలన్నీ మూటగట్టుకున్న అధికారులేమో సస్పెన్షన్లతో కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. అటు న్యాయం కోసం పోరాడిన బాధితులు.. వ్యవస్థల అపవిత్ర కలయికను చూసి, విసిగిపోయి న్యాయాన్ని వెతకడమే మానేస్తారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media