పారిశ్రామిక వనరులు పుష్కలంగా ఉన్న కడప జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచి, విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (JC) డా. నిధి మీనా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశంలో ఆమె మాట్లాడారు.

జిల్లాలో సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అందిన 11,033 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 10,886 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేసినట్లు జేసీ తెలిపారు. మిగిలిన పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పారిశ్రామిక అభివృద్ధి పాలసీలో భాగంగా వివిధ కేటగిరీల కింద సుమారు రూ. 3.53 కోట్ల నిధుల విడుదలకు అనుమతినిచ్చారు. ఇందులో ఎస్సీ కేటగిరీ యూనిట్లకు ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయించారు. కొత్తగా పరిశ్రమలు స్థాపించాలనుకునే నిరుద్యోగ యువతకు బ్యాంకర్ల ద్వారా ఆర్థిక ప్రోత్సాహం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ స్థాయి వరకు పారిశ్రామిక పెట్టుబడులపై అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. పరిశ్రమల శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అగ్నిమాపక, విద్యుత్ వంటి అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో పనిచేసి పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం చాంద్ బాషా, వివిధ శాఖల అధికారులు, ఏపీఐఐసీ (APIIC) ప్రతినిధులు పాల్గొన్నారు.
