కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వద్ద చారిత్రక నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. స్వామి నివాసంగా ఉన్న సుమారు 350 ఏళ్ల ప్రాచీన భవనం ఇటీవల కూలిపోవడం భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గోడలు బలహీనపడి కూలినట్లు సమాచారం. అయితే భవనానికి చారిత్రక ప్రాధాన్యం ఉన్నప్పటికీ, దానిని సంరక్షించడంలో ప్రభుత్వం, పురావస్తు శాఖ తీవ్ర నిర్లక్ష్యం చూపిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అదృష్టవశాత్తు ఘటన సమయంలో ఎవరూ భవనంలో లేకపోవడంతో పెద్ద ప్రాణనష్టం జరగలేదు.
ఘటన తెలిసిన వెంటనే పూర్వ మఠాధిపతుల కుమారులు వెంకటాద్రి స్వామి, వీరంభట్లయ్య స్వామి, దత్తాత్రేయ స్వామి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు, భవనం చారిత్రక ప్రాధాన్యం ఉన్నదని, వర్షాల ప్రభావంతో అది బలహీనపడినా, ప్రభుత్వం సమయానికి మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే ఇది కూలిపోయిందని పేర్కొన్నారు.భక్తులు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, పవిత్ర స్థలాన్ని యథాతథంగా పునర్నిర్మించాలని, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ఈ మఠం సంరక్షణలో ప్రభుత్వం దీర్ఘకాలంగా నిర్లక్ష్యం చూపడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
