కాకినాడ నగరంలో దారుణ హత్య జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. కాకినాడ గాంధీనగర్‌లోని రెడ్ క్రాస్ భవనం సమీపంలో ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. మృతుడిని ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావు (46)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీమ్, ఫింగర్‌ప్రింట్ నిపుణులు ఘటనా స్థలం నుంచి కీలక ఆధారాలు సేకరించారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, పాత కక్షల కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
